అంతర్జాతీయం: అక్రమ మైనర్లపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం కఠిన నిర్ణయం
“అక్రమ మైనింగ్ గనిలో చిక్కుకున్న వారికి ఎలాంటి సాయం లేదు”: దక్షిణాఫ్రికా ప్రభుత్వం కీలక నిర్ణయం
దక్షిణాఫ్రికాలో, అక్రమ మైనింగ్ పై ప్రభుత్వం కఠిన వైఖరి చేపట్టింది. ముఖ్యంగా ‘జమా జమాస్’ అని పిలవబడే అక్రమ మైనర్లు వదిలివేయబడిన గనులలోకి ప్రవేశించి గనుల లోపలే ఉండిపోయిన ఈ పరిస్థితులపై నిర్ణయాలను తీసుకుంది.
దేశంలో అంచనాల ప్రకారం 30,000 మందికి పైగా అక్రమ మైనర్లు ఉన్నారు, వీరు భూగర్భంలో ఉన్న బంగారాన్ని తవ్వడం కోసం చొరబడుతున్నారు.
అయితే, అక్రమంగా గనిలోకి ప్రవేశించిన మైనర్లను కాపాడే ఉద్దేశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రస్తుతం వాయువ్య ప్రాంతంలోని ఒక బంగారు గనిలో దాదాపు 4,000 మంది అక్రమ మైనర్లు చిక్కుకుపోయారు.
వీరికి సహాయంగా ఆహారం, నీరు వంటి నిత్యవసరాలను అందించకుండా గని ద్వారాలను మూసివేసినట్టు అధికారులు వెల్లడించారు.
ఒకవేళ వారు బయటకు రావాలనుకుంటే, వారిని వెంటనే అరెస్టు చేసేందుకు పోలీసు యంత్రాంగం సిద్దంగా ఉంది.
“అక్రమంగా గనిలోకి ప్రవేశించి వనరులను తవ్వడం నేరమే. ఈ నేపథ్యంలో వారికి ప్రభుత్వం ఎలాంటి సాయం చేయదు,” అని కేబినెట్ మంత్రి పేర్కొన్నారు.
‘క్లోజ్ ది హోల్’ పేరుతో చేపట్టిన ఈ చర్యల ద్వారా నేరస్థులను గనుల వద్ద చట్టబద్దంగా అడ్డుకుంటామని అన్నారు.