టాలీవుడ్: కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్స్ అన్ని నాలుగు నెలలుగా మూతపడి ఉన్నాయి. సెకండ్ వేవ్ ముగిసి థియేటర్లు తెరచుకోమని అనుమతులు వచ్చినా కూడా కొన్ని సందేహాల మధ్య ఇంకా థియేటర్ లు తెరుచుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్ల కి సంబందించిన బిల్లు కు సంబందించిన ఇష్యూ ఒకటి పెండింగ్ లో ఉండడం తో, థియేటర్లు తెరచుకున్నా కూడా జనాలు థియేటర్లకు వస్తారా రారా అన్న సందేహం లో , కొత్త సినిమాలు ఏవీ రిలీజ్ డేట్ లు ప్రకటించకపోవడం తో థియేటర్లు తెరచుకున్నా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు అన్న కారణాలతో ఇన్ని రోజులు థియేటర్ లు తెరుచుకోలేదు. కానీ ఈరోజు చేసిన ఒక ప్రకటనతో ఈ సవాళ్ళన్నిటికి ఒక సమాధానం దొరికింది.
ఈ రోజు సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు‘ సినిమా విడుదల తేదీ ని ప్రకటించింది సినిమా టీం. జులై 30 వ తేదీ న ఈ సినిమాని థియేటర్ లలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మొదట విడుదలయ్యే సినిమా ఇది అని ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేసారు. మొదటి వేవ్ లో ‘సాయి తేజ్’ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ లాగా ఈ సినిమా కూడా మంచిగా ఆడి తర్వాత విడుదల అవ్వబోయే సినిమాలకి ఆశా కిరణం గా మారాలని ఆశిద్దాం. ఈ సినిమాలో అన్యాయాన్ని ఎదురించే ఒక లాయర్ పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు, సృజన్ యరబోలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శరన్ కొప్పిశెట్టి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.