న్యూఢిల్లీ: భారత్ ను ఇప్పటికే కరోనా సెకండ్‌వేవ్ ప్రకంపనలతో అతలాకుతలం చేస్తోంది. ఈ తరుణంలో కేంద్ర ప్రధాన సాంకేతిక సలహాదారుడు అయిన డాక్టర్ కే విజయరాఘవన్ పెద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహమ్మారి యొక్క మూడవ వేవ్ తప్పదంటూ అత్యున్నత శాస్త్రీయ సలహాదారు ఒక పెద్ద బాంబు వేశారు.
అయితే ఈ మూడవ వేవ్ ఎప్పుడొస్తుంది, ఎలా వస్తుంది అనే స్పష్టత లేకున్నా ముప్పు మాత్రం తప్పదని అంటున్నారు. ఇంకా ఈ థర్డ్ వేవ్ నాటికి కరోనా వైరస్ మరింతగా మారవచ్చు అని, భవిష్యత్‌లో ఇంకా మరికొన్ని వేవ్‌లు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందని తెలిపారు. కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్ తయారు చేసుకోవాలని విజయరాఘవన్ సూచించారు. అయితే ప్రస్తుత వేరియంట్లపై వ్యాక్సిన్ బాగా పని చేస్తోందని ఆయన తెలిపారు.
దేశంలో ప్రస్తుత మహమ్మారి అంతానికి, కొత్త రకం వైరస్‌లను ఎదుర్కోనేందుకు టీకాలపై మరింత పరిశోధనలను చేయాల్సిన అవసరం చాలా వరకు ఉందని విజయరాఘవన్ హెచ్చరించారు. ఈ వైరస్ అధిక స్థాయిలో విజృంభిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ఎదుర్కొనేందుకు పలు మార్పులు, కఠిన ఆంక్షలు, మార్గదర్శకాలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
అయితే ఇప్పటికే కరోనా విజృంభణ రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. గత వారం రోజులుగా 3 లక్షలకు తగ్గకుండా నమోదవుతున్న రోజువారీ కేసులు బుధవారం నాటి గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3.82లక్షల కేసులు నమోదైనాయి. ఒక్క రోజులో మరణిస్తున్నా వారి సంఖ్య రికార్డు స్థాయిలో 3,780కి ఎగబాకింది. ప్రపంచ కేసులలో 46 శాతం భారత్ వాటా ఉందని, గత వారంలో ప్రపంచ మరణాలలో నాలుగింట ఒక వంతుగా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.