జెనివా: కరోనా మహమ్మారి దశలు మార్చుకుని ఇంకా విజృంభిస్తూనే ఉంది. ఈ వైరస్ పలు మార్పులకు లోనవుతూ మరింత ప్రమాదకరంగా మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. రెండవ వేవ్ మన దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ వేవ్ లో రోజుకు కొన్ని వేల మరణాలు, లక్షల్లో కొత్త కేసులు నమోదయ్యాయి.
ఈ రెండవ వేవ్ ఇంకా పూర్తిగా ముగియకనే ఇప్పుడు థర్డ్ వేవ్ ముప్పు గూర్చి హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓ థర్డ్ వేవ్ గురించి ఒక కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అప్పుడే థర్డ్ వేవ్ దశ ప్రారంభమైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానమ్ హెచ్చరించారు.
టెడ్రోస్ మాట్లాడుతూ, దురదృష్టం కొద్ది ఇప్పుడు ప్రపంచం మూడవ వేవ్ ప్రారంభ దశలో ఉంది. అప్పుడే ప్రపంచ వ్యాప్తంగా 111 దేశాల్లో కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి జరుగుతోంది. ఈ కోవిడ్ వేరియంట్ ఉండడమే కాక అతి త్వరలోనే ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి పెరుగుతుందని భావిస్తున్నాం అన్నారు.
ఈ డెల్టా ప్లస్ వేరియంట్ యొక్క వేగమైన వ్యాప్తి, మరియు జన సంచారమే ఈ మూడవ వేవ్‌కు ప్రధాన కారణం అని అన్నారు. కోవిడ్ డెల్టా వేరియంట్ వ్యాప్తిని సామాజిక చైతన్యం, సమర్ధవంతమైన ప్రజ ఆరోగ్య చర్యల ద్వారా అడ్డుకోవాలని ఆయన సూచించారు. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరియు వైరస్ వల్ల మరణాలు రెండింటిలోనూ హెచ్చ్దల కనిపిస్తుందన్నారు.
కాగా ఐరోపా మరియు ఉత్తర అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత కోవిడ్ కేసులు, మరణాలు తగ్గినట్లనిపించాయి కానీ, ఇప్పుడు ఈ పరిస్థితి మళ్ళీ మారుతోందని నివేదికలు తెలియజేస్తున్నాయి. కరోనా వైరస్ రూపు మార్చుకుని అభివృద్ధి చెందుతూనే ఉందని, దీని ఫలితంగా మరింత వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్‌లు ఇంకా పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని టెడ్రోస్ ఆందోళన వ్యక్త చేశారు.
డబ్ల్యూహెచ్ఓ పరిధిలో ఉన్న ఆరు రీజియన్లలో గత నాలుగు వారాలుగా కొత్త పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. కొత్త కేసుల నమోదుతో పాటు కొన్ని వారాల పాటు తగ్గిన మరణాలు ఇప్పుడు తిరిగి పెరగడం ఆందోళన కలిగించే అంశం అన్నారు. కాగా వ్యాక్సిన్లు ఒక్కటే మహమ్మారిని ఆపలేవని, అనుకూలమైన, స్థిరమైన విధానంతో దేశాలు ముందుకు వెళ్లాలని సూచించారు.
ప్రజలు ఇంకా భౌతికదూరం పాటించడం మరియు మాస్క్ ధరించడం వంటి కరోనా నివారణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మరియు ఆరోగ్య మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలని ఆయన తెలిపారు. ప్రపంచంలొ ఇప్పటికే పలు దేశాలు ఇలాంటి ముందుజాగ్రత్త చర్యలతోనే కోవిడ్-19ను అడ్డుకుంటున్నాయని టెడ్రోస్ గుర్తుచేశారు.