టాలీవుడ్: కరోనా తర్వాత అన్ని ఇండస్ట్రీస్ లో సినిమాలు విడుదల చేయడానికి బయపడుతుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాత్రం వారానికి దాదాపు మూడు నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. విడుదల అవడం మాత్రమే కాకుండా మంచి టాక్ వస్తే కలెక్షన్స్ సాధిస్తూ బ్లాక్ బస్టర్ రేంజ్ కి వెళ్తున్నాయి. ఈ వారం మరో నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి.
ఈ సంవత్సరం ఫిబ్రవరి చెక్ సినిమాని విడుదల చేసిన నితిన్ ‘రంగ్ దే’ అనే మరో సినిమాని రేపు విడుదల చేస్తున్నాడు. కీర్తి సురేష్, నితిన్ హీరో హీరోయిన్ లుగా రూపొందిన ఈ సినిమా పూర్తి ఫామిలీ ఎంటర్టైనర్ గా రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందింది. ఈ సినిమా నుండి విడుదలైన పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్ మంచి ఫీల్ గుడ్ మూవీ చూడబోతున్న ఫీల్ ని కలిగించాయి. తొలిప్రేమ, మజ్ను లాంటి లవ్ స్టోరీస్ రూపొందిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రేపు విడుదల అవుతుంది.
కెరీర్ ప్రారంభం నుండి సినిమాలో తన పాత్ర ఎంత ఉంది అన్నట్టు కాకుండా సినిమాకి తన పాత్ర ఎంత అవసరం అని చూసుకుంటూ ప్రతి సినిమాలో కొత్త రకమైన పాత్రలలో నటిస్తున్న రానా దగ్గుబాటి హీరోగా రూపొందిన ‘అరణ్య’ సినిమా రేపు విడుదల అవుతుంది. కుంకీ (గజరాజు) సినిమాని రూపొందించిన ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. దాదాపు రెండున్నర సంవత్సరాలు రానా ఈ సినిమా కోసం అడవుల్లో ఏనుగుల మధ్య కష్టపడ్డాడు. ఈ సినిమాలో రానా నటన కూడా ప్రత్యేకంగా ఉండబోతుందని మేకర్స్ తెలిపారు.
మత్తువదలరా సినిమాతో ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం అయిన కీరవాణి రెండవ కుమారుడు ‘శ్రీ సింహ’ హీరోగా ‘తెల్లవారితే గురువారం’ అనే సినిమా ఈ శని వారం విడుదల అవబోతుంది. రొమాంటిక్ కామెడీ జానర్లో రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.
వీటితో పాటు ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే మరో చిన్న సినిమా కూడా విడుదల అవుతుంది. అలాగే ఈరోజే ‘గాడ్జిల్లా Vs కాంగ్’ అనే హాలీవుడ్ యాక్షన్ సినిమా కూడా విడుదలైంది. ఈ సినిమా పై కూడా మంచి అంచనాలు ఉండడం తో అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఫిల్ అయిపోయాయి.