ఆంధ్రప్రదేశ్‌కు ఈ నెలలో మరో మూడు తుఫాన్లు రావచ్చని వాతావరణ సఖ అంచనా వేస్తోంది!
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను మరోమారు తుపాన్ల ముప్పు వెన్నాడుతోంది. అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుపాన్లు వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్టోబర్ నెలలో తుపాన్ల ప్రభావం మామూలుగా ఉండదు. ఈ నెలలో గతంలో వచ్చిన తుపాన్లు రాష్ట్రంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. అందుకే అక్టోబర్ వస్తుందంటేనే ప్రజలు భయంతో ఉంటారు. కాస్త గాలి వీచినా, ఉరుము ఉరిమినా, రైతులు సహా చాలా మంది ఆందోళనకు గురవుతుంటారు.
కోస్తా జిల్లాల్లో వర్ష సూచన
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం వల్ల రాబోయే మూడు రోజుల్లో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం, ఈ సమయంలో అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుపాన్లు ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంటుంది.
జిల్లాల్లో వర్షాలు
అక్టోబర్ 6న తూర్పు గోదావరి, ఏలూరు, అనంతపురం, నెల్లూరు, నంద్యాల, ఎన్టీఆర్, అనకాపల్లి, కర్నూలు వంటి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. నిన్న రాత్రివరకు, రాజమహేంద్రవరంలో అత్యధికంగా 53 మి.మీ వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, రాబోయే కొన్ని రోజుల్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయి.
విచిత్ర పరిస్థితి
వర్షాలతో పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పెరిగాయి. విశాఖపట్నం, తుని, కాకినాడ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి.