అమరావతి: ఏపీ అసెంబ్లీలో మూడు కీలక బిల్లులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం మూడు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ బిల్లు – 2024, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ బిల్లు – 2024లను మంత్రి నారాయణ ప్రవేశపెట్టగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు – 2024ను మంత్రి పైయ్యావుల కేశవ్ సభలో ప్రాధాన్యతతో సమర్పించారు.
శాసనమండలిలో బడ్జెట్ చర్చ – వైసీపీ ఎమ్మెల్సీల విమర్శలు
శాసనమండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో వైసీపీ ఎమ్మెల్సీలు ముఖ్యమైన సూపర్ సిక్స్ పథకాల అమలుపై నిధుల కేటాయింపులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్తూ పథకాల అమలుపై క్లారిటీ ఇవ్వలేదని వారు విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ప్రభుత్వ హామీలు అమలు చేయకపోవడంపై వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు.
సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని అడిగితే, లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్తున్నారన్నారు. సూపర్ సిక్స్ పథకాల ప్రకటనలు చేసేటప్పుడు, ఆ అప్పులు గుర్తుకు రాలేదా అని ప్రభుత్వాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు.
వైసీపీ ఆరోపణలపై ప్రభుత్వ స్పందన
వైసీపీ విమర్శలకు ప్రభుత్వం ధీటుగా బదులిచ్చింది. నాలుగున్నర నెలల పసికూన ప్రభుత్వంపై నిందలు వేయడం తగదని ప్రభుత్వం హితవు పలికింది.
తమ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, ప్రజలకు అనుకూలంగా పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు.
రాజధాని నిర్మాణానికి కేంద్రం 15 వేల కోట్ల గ్రాంట్
రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయల గ్రాంట్ ఇచ్చిందని, ఇది లోన్ కాదని, ప్రత్యేకంగా రాష్ట్రానికి అందిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ శాసనమండలిలో ప్రకటించారు.