న్యూఢిల్లీ: భారత్ దేశంలో రోజు రోజు కు కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే వుంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా వైరస్‌ను మాత్రం కట్టడి చేయలేకపోతున్నాయి. దీంతో తొందరగా కరోనా టెస్టులు చేయాల్సిన అవసరం పెరిగింది. ఎందుకంటే పరీక్షలు చేయడం అలస్యమైతే కరోనా ఒకరి నుంచి మరొకరికి వారి నుంచి ఇంకొంత మందికి వేగంగా వ్యాపిస్తుంది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దేశంలో కరోనా నిర్ధారణ్కు రెండు రకాల పరీక్షలను సూచించింది. అవి ఆర్‌టీ- పీసీఆర్, యాంటీబాడీ పరీక్షలు. ఈ పరీక్షలను ప్రభుత్వ అనుమతి పొందిన కొన్ని ప్రైవేట్ ల్యాబ్‌లు కూడా నిర్వహించవచ్చు. అలాంటి ల్యాబ్‌లో థైరోకేర్ ఒకటి. థైరోకేర్ 60,000 పరీక్షలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడయ్యింది.
ఆ నివేదిక ప్రకారం భారత దేశంలో దాదాపు 18 కోట్ల మంది భారతీయులు ఇప్పటికే కోవిడ్ రోగనిరోధక శక్తిని కలిగి ఉండవచ్చని పేర్కొంది. దేశంలో దాదాపు 15 శాతం మంది కరోనా వైరస్ కు వ్యతిరేకంగా తమ శరీరంలో యాంటీబాడీస్ కలిగి వుండవచ్చని తమ డేటాలో తేలిందని తెలియజేసింది.
దేశంలోని 600 ప్రాంతాల్లో దాదాపు 60 వేల మందిపై సుమారు 20 రోజుల పాటు ఈ సంస్థ యాంటీ బాడీ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. దేశంలో దాదాపు 15 శాతం మందిలో ఇప్పటికే ప్రతినిరోధకాలు అభివృద్ధి చెందినట్లు తెలుస్తోందని మా స్టడీ తెలిపింది అని పేర్కొంది. ఈ విషయాన్ని థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ వెలుమని ట్విట్టర్ ద్వారా తెలిపారు. తమ అంచనాల్లో 3 శాతం అటూఇటుగా ఉండవచ్చని పేర్కొన్నారు.