తిరుపతి: శ్రీవారిమెట్టు వద్ద టిక్కెట్ల దందా – భక్తులకు కిందే శఠగోపం!
భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న మోసగాళ్లు
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా శ్రీవారిమెట్టు మార్గంలో నడిచే భక్తులకు ఉచితంగా టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించినప్పటికీ, కొందరు ప్రైవేటు వాహనదారులు ఈ విషయాన్ని ఉపయోగించుకొని భక్తుల నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నారు.
500 నుంచి 2,000 వరకు వసూలు చేస్తున్న ఆటోవాలాలు
తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండు, శ్రీనివాసం, విష్ణు నివాసం ప్రాంతాల్లో ఆటోడ్రైవర్లు భక్తులను నమ్మించి, శ్రీవారిమెట్టులో దర్శన టికెట్లు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్నారు. ఒక్కో భక్తుడి నుంచి రూ.500 నుంచి రూ.2,000 వరకు వసూలు చేసి, వారి వారి వాహనాల్లో శ్రీవారిమెట్టుకు తరలిస్తున్నారు.
టోకెన్లు అంటూ దోపిడీ.. తీవ్ర అసౌకర్యం
శ్రీవారిమెట్టుకు చేరుకున్న భక్తులు టోకెన్లు అందుబాటులో లేవని తెలిసి నిరాశ చెందుతున్నారు. రోజుకు టీటీడీ కేవలం 3,000 టోకెన్లను మాత్రమే జారీ చేస్తోంది. కానీ, మోసపోయిన భక్తులు 10,000 మందికిపైగా శ్రీవారిమెట్టుకు చేరుకోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ట్రాఫిక్ సమస్య.. తొక్కిసలాట ముప్పు
శ్రీవారిమెట్టుకు అనుకున్నదానికంటే ఎక్కువ మంది భక్తులు రావడంతో, ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. వాహనాల రద్దీతో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తుల కోసం అక్కడ కేవలం ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందే ఉండటంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం నెలకొంది.
టీటీడీ ప్రకటన.. భక్తులకు హెచ్చరిక
టైమ్ స్లాట్ దర్శన టోకెన్లు పూర్తిగా ఉచితమని, ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు అధికారికంగా టోకెన్లు పొందేందుకు టీటీడీ సెంటర్లను మాత్రమే ఆశ్రయించాలని విజ్ఞప్తి చేసింది.