హైదరాబాద్: టిక్ టాక్, ఇది పరిచయం అవసరం లేని పేరు. చైనా రూపొందించిన ఈ యాప్ ఆ దేశంలో వాడక పోయినా ప్రపంచం మొత్తం వాడుతోంది. భారత్ లో ఇప్పుడు ఈ యాప్ నిషేదించారు. దీంతో ఎందరో యువత, సెలబ్రిటీలు షాక్ తిన్నారు.
ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ఇది ఒక అస్త్రంగా మారింది. భారత్ నిషేధించిన టిక్ టాక్ ఇప్పుడు “టిక్ టాక్ ప్రో” గా వచ్చింది, ఇది మంచి ప్రత్యామ్నాయం అని టిక్ టాక్ యూజర్లకు మెసేజులు పంపుతున్నారు. ఈ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి అని పంపిన లింక్ ద్వారా యూజర్ల వ్యక్తిగత వివరాలతో సహా బ్యాంకింగ్ సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు తస్కరించి అకౌంట్ లలో డబ్బులు ఖాళీ చేస్తున్నారు.
టిక్ టాక్ వల్ల ఎందరో రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మారారు. వీరంతా ఇప్పుడు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో సైబర్ నేరగాళ్ళకు చిక్కుతున్నారు. ఇంతకుముందు ఆరోగ్యసేతు యాప్ విషయంలో కూడా సైబర్ నేరగాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు ఎర వేశాయి. వారు పంపే లింక్ లలో మాల్ వేర్ ను చొప్పించి ముఖ్యమైన సమాచారాన్ని నేరగాళ్ళకు చేరవేసేలా చేస్తున్నారు. తద్వారా ఇప్పటికే కోట్లు కొల్లగొట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల కంప్యూటర్లలో ఇది చేరితే రహస్య సమాచారం నేరగాళ్ళ చేతిలో పడే అవకాశం ఉంది, ఇది అత్యంత ప్రమాదకరం అని తెలంగాణ పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది.
భారత్ లో టిక్ టాక్ యాప్ వినియోగదారులు దాదాపు 24 కోట్ల మంది ఉండేవారు. భారత ప్రభుత్వం నిషేధించే నాటికి ఈ యుజర్ల సంఖ్య 12 కోట్లుగా ఉంది. వీరందరి అవసరాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్ళు ఈ యూజర్లను టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి వీరందరూ ఇలాంటి ఎరలో పడకుండా జాగ్రత్త వహించాలని, ఏవైనా ఫిర్యాదులు ఉంటే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు. ఇలాంటి వారి ఎరలో పడి వ్యక్తిగత వివరాలు వారి చేతుల్లో పడితే బ్లాక్ మెయిల్ కు సైతం పాల్పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త!