పారిస్: ఆండ్రాయిడ్ ఫోన్ల గురించి ఆపిల్ సీఈవో టిక్‌కుక్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తమ ఆపిల్ ఫోన్లతో పోల్చుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లకే అత్యధిక మాల్‌వేర్ ముప్పు ఉందని ఆపిల్ సీఈవో టిక్‌కుక్ అభిప్రాయపడ్డారు. జూన్ 16వ తేదీన పారిస్‌లో జరిగిన వివాటెక్ 2021 వర్చ్యువల్ కాన్పరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు.
కాగా టిం కుక్ ఈ సమావేశంలో ఆండ్రాయిడ్ ఫోన్లపై తనకున్న అక్కసును బట్టబయలు చేశారు. ఆపిల్ ఫోన్లలో ఉపయోగించే ఐవోస్ కంటే ఆండ్రాయిడ్ ఫోన్లపైనే ఎక్కువగా మాల్‌వేర్ దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఆపిల్ కంటే 47 రెట్లు ఎక్కువ మాల్ వేర్ కలిగి ఉందని కుక్ పేర్కొన్నారు.
యూరోపియన్ దేశాల్లో త్వరలో అమలులోకి తీసుకురానున్న డిజిటల్ మార్కెట్ కు సంబంధించిన నూతన చట్టంతో ఆపిల్ మరియు గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు మార్కెట్‌లో తమ గుత్తాధిపత్యాన్ని చలాయించకుండా ఉంచేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. ఈ చట్టం అమలుతో సైడ్‌లోడింగ్ యాప్స్ (థర్డ్ పార్టీ యాప్స్)ను యూజర్లు ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఏలాంటి అడ్డంకులు రావు.
అయితే టిమ్ కుక్ మాత్రం ఈ చట్టాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. సైడ్‌లోడింగ్ యాప్స్‌తో యూజర్ల భద్రతకు, ప్రైవసీ భంగం వాటిల్లుతుందనీ ఆయన ఈ సందర్భంగా హెచ్చరించాడు. అయితే ఇలా బలవంతంగా ఈ థర్డ్‌పార్టీ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయడంతో తమ ఆపిల్ ఐవోస్ ప్లాట్‌ఫాం దెబ్బతీనే అవకాశం ఉందని విచారం వ్యక్తం చేశారు. ఆపిల్ స్టోర్‌లోకి యాప్స్ ఏంట్రీ ఇవ్వాలంటే వాటిపై కచ్చితమైన రివ్యూ చేశాకే తమ స్టోర్‌లో వాటిని అందుబాటులో ఉంచుతామని వివరించాడు.