తిరుమల: శ్రీవారి దర్శనానికి భక్తులు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితిని తొలగించేందుకు టీటీడీ సరికొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో గంటలోపు దర్శనం పూర్తి చేసుకునే విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఈరోజు ప్రారంభించింది.
టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు వివరాల ప్రకారం, భక్తులకు ఆధార్ కార్డు ఆధారంగా ఫేస్ రికగ్నిషన్ టోకెన్లు జారీ చేస్తారు.
టోకెన్‌లో సూచించిన సమయానికి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకుంటే, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా ఎంట్రీని స్కాన్ చేసి క్యూ లైన్‌లోకి అనుమతిస్తారు.
ఈ విధానం ముందుగా వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయబడుతుంది. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే ఈ విధానానికి ఈ నెల 24న జరిగే పాలకమండలి సమావేశంలో ఆమోదం లభించనుంది.
ఈ టెక్నాలజీకి నాలుగు విదేశీ సంస్థలు తమ సహకారం అందించేందుకు సిద్ధమయ్యాయని టిటిడి వెల్లడించింది. భక్తుల కోసం ఈ వినూత్న చర్యను తీసుకుంటున్న టిటిడి ఈ విధానం ద్వారా దర్శనానికి వేచి ఉండే ఇబ్బందులను తగ్గించనుంది.