తిరుమల: తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలనలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విశేష మార్పులు చోటుచేసుకున్నాయని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
గతంలో సామాన్య భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, దర్శన సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా భక్తులకు తక్షణ దర్శనం కల్పించామని ఆయన అన్నారు.
గతంలో టీటీడీలో వివాదాలు తరచూ జరిగేవని, ప్రస్తుతం అందుకు తావు లేకుండా పాలన సాగుతోందని ఆనం వెల్లడించారు.
ప్రతి నెల తిరుమలకు స్వయంగా వెళ్లి, భక్తుల సౌకర్యాలపై సమీక్ష జరుపుతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం రాష్ట్రంలోని 5,400 ఆలయాలకు ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే నిధులను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచిందని ప్రకటించారు.
మఠాలు, ఆలయాలు తమ ప్రాధాన్యతను కోల్పోయి వ్యాపార ధోరణిలో నడిస్తే ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో పూజారుల సేవలు, భక్తుల అనుభవాలు మరింత మెరుగ్గా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆనం వివరించారు.
తిరుమలలో చేసిన మార్పులు కేవలం పాలన పరంగానే కాకుండా భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టడంలో కీలకమని మంత్రి వ్యాఖ్యానించారు.