తిరుమల: తిరుమల లడ్డూ ప్రసాదం హిందూవులకు పవిత్రమైనది. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులు లడ్డూ ప్రసాదాన్ని ఎంతో ఆరాధనతో స్వీకరిస్తారు. అయితే, ఇటీవల ఈ ప్రసాదం తయారీపై పెద్ద వివాదం చెలరేగింది.
తిరుమలలో భక్తులు లడ్డును ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి ప్రసాదం తయారీలో జంతువుల నుంచి తయారైన కొవ్వును ఉపయోగించడం అత్యంత దుర్మార్గమని, ఈ చర్య భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమలలో మళ్లీ స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నామన్న చంద్రబాబు, వైసీపీ హయాంలో నాసిరకం లడ్డూలను, నాణ్యతలేని అన్నప్రసాదాలను భక్తులకు ఇచ్చారని ఆరోపణలు చేశారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. వైఎస్సార్సీపీ నేతలు, ముఖ్యంగా మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చంద్రబాబును తీవ్రంగా ఖండించారు. సుబ్బారెడ్డి, కుటుంబంతో సహా లడ్డూ తయారీ విషయంలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని చంద్రబాబుకు సవాలు విసిరారు. అలాగే, కరుణాకర్ రెడ్డి కూడా చంద్రబాబు వ్యాఖ్యల్ని తీవ్రంగా విమర్శించారు. విష ప్రచారం చేస్తే తిరుమల దేవుడు స్వయంగా శిక్ష విధిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుమల లడ్డూ తయారీలో రోజుకు 300-500 లీటర్ల నెయ్యి అవసరం ఉంటుంది. టీటీడీ ప్రతి ఆరు నెలల్లో నెయ్యి ప్రొక్యూర్‌మెంట్ ద్వారా సరఫరా చేయిస్తుంటుంది. 2021 మార్చ్ వరకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ద్వారా నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అయింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రీమియర్, ఆల్ఫా కంపెనీలు టెండర్ల ద్వారా నెయ్యి సరఫరా చేశాయి. అయితే, ఆల్ఫా సంస్థ విదేశాల నుంచి బటర్ ఆయిల్ దిగుమతి చేసి లడ్డూ తయారు చేసిందని కొన్ని వర్గాలు ఆరోపించాయి.
ఈ వివాదం తిరుమల పవిత్రతను ప్రశ్నించేంతవరకు వెళ్లింది. టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య మాటల యుద్ధం రాజుకుంది. చంద్రబాబు తిరుమల పవిత్రతను కాపాడటానికి తామే నిష్కలంకంగా పనిచేశామని, వైఎస్సార్సీపీ హయాంలో ఎన్నో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తుండగా, వైసీపీ నేతలు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తిరుమలలో పలు మార్పులు తీసుకువచ్చారు. శ్యామల రావును టీటీడీ ఈవోగా నియమించారు, తిరుమలలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ఉచిత దర్శనం, లడ్డూ పంపిణీ వంటి కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు.