తిరుపతి: గ్రీన్ ఎనర్జీ విభాగంలో మరో కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.1000 కోట్ల పెట్టుబడితో వచ్చిన ఈ ప్రాజెక్ట్ ద్వారా 2000 మందికి ఉపాధి లభించనుంది.
ఈ ప్లాంట్ ద్వారా సంవత్సరానికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. ఇది కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అంతేగాక, ఈ మోడల్‌ను రాష్ట్రంలోని ఇతర పరిశ్రమలు కూడా అనుసరించగలవని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఉన్న భౌగోళిక ప్రయోజనాలను ఉపయోగించుకొని గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతుల్లో ముందుండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు.
ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 206 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని, 190 టన్నుల ఆక్సిజన్ విడుదల అవుతుందని అధికారులు తెలిపారు. దీని వల్ల రాష్ట్రంలోని పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు.
ఈ ప్రాజెక్ట్ ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ విభాగంలో కీలకమైన హబ్‌గా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తిరుపతిలో మొదలైన ఈ ప్రయాణం త్వరలో మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తున్నాయి.