తిరుపతి: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చి జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
ఈ ఉదయం నిర్వహించిన సమీక్షలో అధికారుల వైఫల్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన డీఎస్పీతో పాటు బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
పోలీసుల ప్రాథమిక నివేదిక ప్రకారం, బైరాగిపట్టెడ వద్ద పార్క్‌లో ఓ మహిళ స్పృహతప్పి పడిపోవడంతో ఆమెను కాపాడేందుకు గేటు తెరవడం, ఆ సమయంలో తొక్కిసలాట జరగడం ప్రధాన కారణంగా పేర్కొన్నారు.
ఈ నిర్లక్ష్యానికి సంబంధించిన ప్రతి కోణాన్ని దర్యాప్తు చేయాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు.
ఘటనకు ముందు భక్తులు భారీగా రావచ్చని స్థానికులు అప్రమత్తం చేసినప్పటికీ, ముందస్తు చర్యలు లేకపోవడాన్ని సీఎం తీవ్రంగా తప్పుబట్టారు.
అపరాధులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే తిరుపతి బయలుదేరి వెళ్లారు. ఆయన మరికాసేపట్లో బాధితులను పరామర్శించనున్నారు.