న్యూ ఢిల్లీ: దేశంలో ఉన్న అన్ని టోల్‌ప్లాజాలను సంపూర్ణంగా ఒక ఏడాదిలోగా తొలగించనున్నామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రకటించారు. టోల్ ప్లాజాలు తొలగించి వాటి స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ సేకరణను తీసుకు రానున్నట్లు తెలిపారు.
ఈ రోజు పార్లమెంట్ లో రవాణా శాఖ మంత్రి “వెహికల్స్ స్క్రాపింగ్ పాలసీ” కి సంబంధించి ఒక ప్రకటన చేశారు. దేశంలోని అన్ని టోల్ ప్లాజాలు ఒక సంవత్సరంలో తొలగించబోతున్నట్లు సభా వేదికగా హామీ ఇచ్చారు. టొల్స్ బదులు జీపీఎప్ ఆధారంగా టోల్ రుసుమును వసూళ్లు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రతి వాహనానికి అమర్చి ఉన్న జీపీఎస్ ద్వారా సదరు వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్ రుసుము వసూలు చేసె ఒక కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నట్లు గడ్కరీ వివరించారు.
దేశంలో ఇప్పటి వరకు దాదాపు 93 శాతం వాహనాలు ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగించి టోల్ రుసుమును చెల్లిస్తూ ప్రయాణం చేస్తున్నారు. కాగా ఇక మిగతా 7 శాతం మంది మాత్రం ఇప్పటికే డబుల్ టోల్ చార్జ్ చెల్లిస్తున్నప్పటికీ ఇంకా ఫాస్ట్ ట్యాగ్ మాత్రం తీసుకోలేదని పేర్కొన్నారు.
కాగా టోల్ వద్ద నగదు చెల్లింపు రుసుమును సులభతరం చేసేందుకు ఫాస్ట్ ట్యాగ్స్ వ్యవస్థను మొదటి సారిగా 2016లో మన దేశంలో ప్రవేశపెట్టారు. 2021 ఫిబ్రవరి 16 నుంచి వాహనాలకు దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థను తప్పనిసరి చేసింది. ఒకవేల ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే టోల్ ప్లాజాలలో రెట్టింపు టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.