టాలీవుడ్: ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి రీమేక్ నామ సంవత్సరమా అనే ప్రశ్న కి సమాధానం అవును అని స్పష్టంగా తెలుస్తుంది. ఇండస్ట్రీ టాప్ హీరో చిరంజీవి దగ్గరి నుండి ఇపుడిపుడే ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న హీరోల వరకు అందరూ రీమేక్ సినిమాలే చేస్తున్నారు. అందులో ఈ సంవత్సరం షూటింగ్ ముగింపు దశలో ఉన్నవి మరియు షూటింగ్ ప్రారంభం అయ్యి ఈ సంవత్సరం విడుదల అయ్యే లిస్ట్ చాలా పెద్దదే వుంది.
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘లూసిఫర్’ మరియు ‘వేదాళం’ సినిమాలని రీమేక్ చేస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, ‘అయ్యప్పణ్ణుమ్ కోశియుమ్’ సినిమాలు చేస్తున్నాడు ఇవి రెండు కూడా రీమేక్ సినిమాలే. వెంకటేష్ ‘అసురన్’ సినిమాని ‘నారప్ప’ గా రీమేక్ చేస్తున్నాడు. నితిన్ ‘అందాదున్’ సినిమాని రీమేక్ చేస్తున్నాడు. విశ్వక్సేన్ ‘ఓహ్ మై కడవులే’ మరియు ‘కప్పేలా’ సినిమాల్ని రీమేక్ చేస్తున్నాడు. సత్యదేవ్ హీరోగా రూపొందుతున్న ‘గుర్తుందా శీతాకాలం’ కన్నడ లో హిట్ అయిన ‘లవ్ మోక్ టైల్ ‘ సినిమాకి రీమేక్.
ఇవే కాకుండా ఇంకా మరి కొన్ని సినిమాలు స్టోరీ మోడిఫికేషన్స్ లో , రైట్స్ కొని హీరోస్ కోసం ఎదురుచూసే స్టేజ్ లో ఉన్నాయి. పైన చెప్పిన లిస్ట్ చూస్తే ఇందులో అన్ని కేటగిరీ ల హీరోలు ఉన్నారు. ఇలా ఒక భాషలో విడుదలైన సినిమాని మరొక భాషలో రీమేక్ చేయడం వలన కొంతవరకు లేదా కొన్ని సెంటర్లలో హిట్ టాక్ లేదా కలెక్షన్స్ పొందవచ్చు కానీ అది అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించింది అని అనిపించుకోదు. ఎందుకంటే ఇప్పుడున్న ఇంటర్నెట్ కాలంలో ఒక భాషలో ఒక సినిమా సూపర్ హిట్ అయింది అంటే ఎదో ఒక మీడియం ద్వారా ఆ సినిమాని చాలా మంది జనాలు చూసేస్తున్నారు. పైన చెప్పుకున్న వాటిలో కొన్ని సినిమాలు ఐతే తెలుగులో డబ్ కూడా అయ్యాయి. అలంటి సినిమాల్ని రీమేక్ చేసి సినీ అభిమానులకి ఏం అనుభూతిని ప్రెసెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. ఇది ఇలాగే కొనసాగితే ఇండస్ట్రీ లో రైటర్స్ కి గడ్డు కాలం ఏర్పడుతుంది. రైటర్స్ కొత్త కథలు రాయడం మానేసి ఉన్న కథల్ని కాపీ కొట్టడమో లేదా రీమేక్ సినిమాలని ఇక్కడి వాతావరణానికి తగ్గట్టు మార్చడమో చేస్తూ ఉంటారు. ఇప్పటికీ కొందరు హీరోలు రీమేక్ సినిమాలని టచ్ చేయకుండా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా వారి దారిలో వెళ్లి కొత్త కథలని కొత్త సినిమాలని అందించి జనాలకి సినిమా ఎక్స్పీరియన్స్ ని సినిమాకి వెళ్లాలనే ఉత్సాహాన్ని అలాగే ఉంచాలని ఆశిద్దాం.