టాలీవుడ్: 70 , 80 ల్లో టాలీవుడ్ హీరోలు ఒక సంవత్సరంలో దాదాపు ఒక ఐదు నుండి ఆరు సినిమాలు రూపొందించి విడుదల చేసేవారు. 90 ల్లో ఈ సంఖ్య రెండు నుండి మూడు కి చేరింది. ఆ తర్వాత కొందరు హీరోలు సంవత్సరానికి ఒకటి, మరి కొందరు రెండు సంవత్సరాలకి ఒక సినిమా వచ్చేట్టు రూపొందించారు. ఐతే ప్రస్తుతం హీరోలు మళ్ళీ పాత రోజుల్ని తలచుకుని సంవత్సరానికి రెండు నుండి మూడు సినిమాలు విడుదల అయ్యేట్టు చూసుకుంటున్నారు. కరోనా వల్ల ఆగిపోయిన సినిమాలు మాత్రమే కాకుండా ప్రస్తుతం చేస్తున్న సినిమాలని కూడా చక చకా సిద్ధం చేస్తున్నారు.
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నారప్ప, F2 మరియు దృశ్యం సినిమాల్లో ఒకే సారి నటిస్తున్నారు. ఆగష్టు వరకు ఈ మూడు సినిమాల్ని విడుదల చేసి సంవత్సరం చివరి వరకు మరో సినిమాని పూర్తి చేసేపనిలో వెంకీ ఉన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ అయ్యాక వరుసగా సినిమాలు ప్రకటించడమే కాకుండా పూర్తి చేస్తున్నాడు కూడా. వకీల్ సాబ్ సిద్ధం చేసి, ప్రస్తుతం హరి హర వీరమల్లు మరియు అయ్యప్పణ్ణుమ్ కోశియుమ్ రీమేక్ రెండు సినిమాలని సిద్ధం చేస్తున్నాడు. మలయాళం రీమేక్ సినిమా ఇంకో రెండు నెలల్లో విడుదల అయ్యే అవకాశాలు ఉండగా హరి హర వీరమల్లు మూవీ సంక్రాంతి బరిలో దించనున్నాడు. ఇవే కాకుండా హరీష్ శంకర్ తో మరో సినిమా ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని మరో నెలలో షూటింగ్ కి రెడీ గా ఉంది. నాగ శౌర్య ఐతే లక్ష్య, వరుడు కావలెను తో పాటు పేరు పెట్టని రెండు సినిమాలతో కలిపి ఏకంగా నాలుగు సినిమాలో ఒకేసారి పని చేస్తున్నాడు.
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఆదిపురుష్, రాధే శ్యామ్, సాలార్ సినిమాలతో కలిపి మూడు సినిమాలని ఒకే సారి సిద్ధం చేస్తున్నాడు. యంగ్ హీరో నితిన్ ఈ సంవత్సరంలో చెక్, రంగ్ దే సినిమాలని విడుదల చేసి జూన్ లో అందాదున్ రీమేక్ ‘మాస్ట్రో’ ని సిద్ధం చేస్తున్నాడు. ఇవి అవగానే చైతన్య కృష్ణ దర్శకత్వంలో పవర్ పేట సినిమాని పూర్తి చేసి ఏడాది చివరి వరకు మరో సినిమాతో రానున్నాడు. మెగా స్టార్ చిరంజీవి ఆచార్య పూర్తి చేసి, లూసిఫర్ రీమేక్ షూటింగ్ మొదలు పెట్టాడు. ఇదే కాకుండా వేదాళం రీమేక్ కూడా ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని షూటింగ్ మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉంది.
వీరితో పాటు నాని, సుధీర్ బాబు, రవి తేజ , వరుణ్ తేజ్, రానా, రామ్ చరణ్ తేజ్, వైష్ణవ తేజ్, నాగ చైతన్య, సందీప్ కిషన్, శర్వానంద్ ఇలా చాలా మంది హీరోలు ఒకే సారి రెండు సినిమాలని షూటింగ్ చేస్తూ సినిమాల మేకింగ్ వ్యవధి ని తగ్గిస్తూ ఎక్కువ మందికి ఉపాధి కలిపించడమే కాకుండా టాలీవుడ్ మార్కెట్ స్థాయిని కూడా పెంచుతున్నారు.