టాలీవుడ్: సినిమాలు విడుదలవడం, కలెక్షన్లు రావడం, మళ్ళీ అంతకు మించి సినిమాలు తియ్యడం అంతకన్నా పెద్ద హిట్ కొట్టడం – బహుశా ప్రతి ఇండస్ట్రీ ఇలాగే ఉంటుంది. కానీ టాలీవుడ్ మాత్రం కొన్ని విషయాల్లో వేరే ఇండస్ట్రీలకి ఆదర్శంగా నిలుస్తుంది. కరోనా టైం లో సీసీసీ- కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో నిధుల్ని సేకరించి కరోనా లాక్ డౌన్ టైం లో ఉపాధి కోల్పోయిన ఎంతో మంది సినీ కార్మికుల్ని ఆదుకుంది ఇండస్ట్రీ. అలాగే కరోనా కొంచెం తగ్గిపోగానే థియేటర్లు తెరచుకోగానే ప్రేక్షకులు కూడా ఏ మాత్రం తగ్గకుండా అన్ని సినిమాలని ఆదరించారు. మంచి సినిమాలకి బ్రహ్మరథం పట్టారు.
ఇప్పుడు సెకండ్ వేవ్ లో మరోసారి సీసీసీ పేరుతో వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. ఇదే కాకుండా ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్, అలాగే రెండేసివెర్ ఇంజెక్షన్ కొరత, హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత ఏర్పడింది. వీటి పేరుతో చాల ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో టాలీవుడ్ పెద్ద నిర్మాణ సంస్థలు చేస్తున్న కృషి మాత్రం అభినందనీయం. ఈ ప్రొడక్షన్ హౌసెస్ అంతా కలిసి ఒక్క సారిగా వారి ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆక్సిజన్ సప్లైలు , రెండేసివెర్ ఇంజక్షన్ ల అందుబాటుని తెలియచేస్తూ ఎవరికైనా అవసరం అన్న వాళ్ళకి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి నుండి సురేష్ ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, డి.వీ.వీ ఎంటర్టైన్మెంట్స్ , గీత ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ వారు తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మెడికల్ ఎమర్జెన్సీ ని స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేయడం అభినందనీయం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నిర్మాణ సంస్థలు చేస్తున్న కృషి వేరే ఇండస్ట్రీ వాళ్ళకి ఆదర్శంగా నిలవనుంది.