టాలీవుడ్: భారతీయ చలన చిత్ర రంగంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ముఖ్య పాత్ర పోషిస్తుంది అనడంలో సందేహం లేదు. ఒక సంవత్సరం లో టాలీవుడ్ నుండి దాదాపు 200 పై చిలుకు సినిమాలు విడుదలవుతుంటాయి. హిందీ పరిశ్రమకి ఏ మాత్రం తీసిపోని సంఖ్య ఇది. అంతే కాకుండా ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు అంటూ మన దగ్గరి నుండి విడుదలైన సినిమాలు బాలీవుడ్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. ఇదంతా ఇపుడు ఎందుకు చెప్పుతున్నాం అంటే కరోనా తర్వాత ఏ సినిమా ఇండస్ట్రీ సాధించని ఘనత మన టాలీవుడ్ సాధించింది.
తమ సినిమాల్ని విడుదల చేయడానికి భయపడుతూ పెద్ద హీరోలు కూడా ఓటీటీ ల్లో విడుదల చేసిన టైం లో డిసెంబర్ లో టాలీవుడ్ నుండి మొదటి సారి ఒక మీడియం హీరో సినిమా థియేటర్ లలో విడుదలైంది. మామూలు టైం లో విడుదలైనా కూడా ఆ సినిమాకి అన్ని కలెక్షన్స్ రాకపోవచ్చు. ఆ సినిమాని జనాలు ఆదరించి మిగతా సినిమాలకి దారి చూపారు. అక్కడి నుండి ఇక టాలీవుడ్ వెనక్కి తిరిగి చూడలేదు.
50 % ఆకుపెన్సీ వున్న టైం లో మంచి కలెక్షన్స్ సాధించి ఈ సంవత్సరం మొదటి బ్లాక్ బస్టర్ ని రవి తేజ ‘క్రాక్’ రూపం లో ఇండస్ట్రీ కి అందించింది. ఆ తర్వాత ప్రతీ వారం రెండు నుండి మూడు మంచి పేరున్న సినిమాలు విడుదలవడం, మంచి ఆదరణ నోచుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఉప్పెన, జాతి రత్నాలు , క్రాక్ లాంటి సూపర్ హిట్ సినిమాలని అందించింది మన ఇండస్ట్రీ. ఉప్పెన , జాతి రత్నాలు ఏకంగా వంద కోట్ల సినిమాల జాబితాలోకి అడుగుపెట్టాయని టాక్. జాతి రత్నాలు ఐతే అమెరికా లో కూడా రికార్డులు సృష్టిస్తుంది.
సినిమాలు విడుదల చేయడానికి భయపడుతున్న టైం లో మన ఇండస్ట్రీ వేరే ఇండస్ట్రీస్ కి మార్గ దర్శకంగా నిలిచింది. టాలీవుడ్ ఇచ్చిన స్థైర్యం తోనే ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ లలో పెద్ద హీరోల సినిమాలు విడుదల తేదీలు ప్రకటించాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో టాలీవుడ్ లో అయితే దాదాపు మూడు, నాలుగు నెలల వరకు విడుదల తేదీలు ఖాళీలు లేవు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. సినిమాలని ఆదరించే విషయం లో మాత్రం తెలుగు సినిమా ఆడియన్స్ అందనంత ఎత్తులో ఉన్నారు.