హైదరాబాద్: టాలీవుడ్‌లో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులతో షాక్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ భాగస్వాములు నవీన్, చెర్రీ నివాసాలతో పాటు వారి కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేపడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో మొత్తం 55 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి.
దిల్ రాజు ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో పెద్ద నిర్మాతగా గుర్తింపు పొందారు. సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ విజయంతో రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఐటీ అధికారులు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించారు.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కూడా ఈ దాడుల్లో ప్రధానంగా లక్ష్యంగా నిలిచింది. దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ అయిన పుష్ప 2 నిర్మించిన నవీన్, చెర్రీ నివాసాల్లో సోదాలు జరిగాయి. ఈ సంస్థ వరుస విజయాలతో టాలీవుడ్‌లో కీలక స్థానం సంపాదించడంతో, పెద్ద బడ్జెట్ సినిమాల సంస్థలపై ఐటీ శాఖ దృష్టి పెట్టినట్లు భావిస్తున్నారు.
ఈ సోదాలు టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. నిర్మాతల పన్నుల వ్యవహారాలు, అనుమానాస్పద లావాదేవీల ఆధారంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే, అధికారిక వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.