గుంటూరు: ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక సీనియర్ నటుడిని కోల్పోయింది. రాయలసీమ మాండలికాన్ని తన ప్రత్యేకమైన వాక్చాతుర్యం తో పలుకుతూ కామెడీ సృష్టించగల అద్భుతమైన నటుడు జయ ప్రకాష్ రెడ్డి. సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా ఏ పాత్ర ఇచ్చినా మెప్పించగల నటుడు జయ ప్రకాష్. ఈ రోజు ఉదయం గుంటూరు లో తన స్వగృహం లో గుండె పోటు తో మరణించారు. లాక్ డౌన్ మొదలైనప్పటినుండి ఆయన అక్కడే ఉన్నారు. ఆయన ఆకస్మిక మరణానికి పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది.
రంగస్థల నటుడిగా ప్రయాణం ప్రారంభించి సినిమాల్లో విలన్ గా తన ప్రయాణం కొనసాగించాడు. ఇప్పటికీ తనకి కుదిరినప్పుడు వారాంతాల్లో నాటకాలు వేసేవాడు. ఎం.ఎస్.నారాయణ, ఏ.వియస్ , కోట శ్రీనివాసరావు వంటి ప్రముఖ నటులకు ధీటుగా ఆయన టాలీవుడ్ లో రాణించారు. జయ ప్రకాష్ రెడ్డి 1946 లో కర్నూల్ లో జన్మించారు.ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్ల. సినీరంగప్రవేశానికి ముందు పోలీస్ అధికారిగా పనిచేశారు. నాటకాల నుండి సినిమాలు మొదలుపెట్టాడు. ‘సమర సింహ రెడ్డి’ సినిమా ద్వారా విలన్ గా మంచి పేరు సంపాదించుకుని అప్పటి నుండి ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ప్రేమించుకుందాం రా- సమరసింహారెడ్డి- జయం మనదేరా- నరసింహనాయుడు- చెన్నకేశవరెడ్డి- ఎవడిగోల వాడిది- సీమ టపాకాయ్- నమో వెంకటేశ- రెడీ వంటి బ్లాక్ బస్టర్లలో నటించారు. ఆయన నటించిన చివరి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. విలనిజాన్ని, కామెడీ విలనిజాన్ని ఆవిష్కరించిన గొప్ప నటుడిగా జయప్రకాష్ రెడ్డి నటన అద్భుతం.