టాలీవుడ్: 2020 మిగిల్చిన నష్టాలతో ఈ సంవత్సరం ప్రారంభంలోనే థియేటర్లు తెరుచుకోవడం, జనాలు థియేటర్లకు రావడం మొదలవడంతో సినిమా నిర్మాతలు కూడా ధైర్యం చేసి సినిమాలు విడుదల చేసారు. సంక్రాంతి మొదలుకొని ప్రతి వారం దాదాపు మూడు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. కరోనా తర్వాత వేరే ఇండస్ట్రీస్ లో సినిమాలు విడుదల చెయ్యడానికి భయపడుతుంటే మన దగ్గర విడుదల తేదీలకోసం పోటీ పడే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో మాత్రం తెలుగు ప్రేక్షకులకి అన్ని ఇండస్ట్రీస్ నుండి అభినందనలు వెల్లువెత్తాయి.
ఈ సంవత్సరం సంక్రాంతి కి రవి తేజ ‘క్రాక్’, రామ్ ‘రెడ్’, బెల్లం కొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ తో ఈ ఏడాది సినిమాలు మొదలయ్యాయి. ఈ మూడింట్లో రవి తేజ ‘క్రాక్’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తమిళ్ డబ్ గా విడుదలైన ‘మాస్టర్’ సినిమా క్రాక్ తర్వాత అంతటి హిట్ కొట్టింది.
ఆ తర్వాత పెండింగ్ ఉన్న కొన్ని సినిమాలు విడుదలయినప్పటికీ అంత ఆకట్టుకోలేదు. ఆ నెల చివర్లో యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా పరవాలేదనిపించిన అంతగా ఆడలేదు.
ఫిబ్రవరి నెల మొదట్లో జాంబీ రెడ్డి సినిమాతో మరో హిట్ ఇండస్ట్రీ కి లభించింది. కొత్త జానర్, కామెడీ ట్రీట్మెంట్ బాగుండడం తో హిట్ టాక్ తో నడిచి కలెక్షన్స్ పెద్దగా రాకపోయినా నిర్మాతకి ప్రాఫిట్స్ మిగిల్చింది. అదే నెలలో అల్లరి నరేష్ నటించిన ‘నాంది’ అనే సినిమా మంచి టాక్ తో పరవాలేదనిపించింది. ఫిబ్రవరిలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా ‘ఉప్పెన’ సినిమా బ్లాక్ బస్టర్ సాధించి దాదాపు వంద కోట్ల కలెక్షన్స్ సాధించింది. అదే నెలలో సుమంత్ ‘కపటదారి’, నితిన్ ‘చెక్’ విడుదలైనప్పటికీ ఆశించిన ఫలితాలని రాబట్టలేకపోయాయ్.
మార్చ్ నెల మొదట్లో సందీప్ కిషన్ 25 వ సినిమాగా ‘A1 ఎక్ష్ప్రెస్స్’ పేరుతో స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా గా విడుదలైంది కానీ అంతగా ఆడలేదు. శివరాత్రి సందర్భంగా రెండవ వారంలో ‘జాతి రత్నాలు’, ‘శ్రీకారం’, ‘గాలి సంపత్’ సినిమాలు విడుదలయ్యాయి. జాతి రత్నాలు మంచి టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. శ్రీకారం మంచి ప్రయత్నం అని పేరు తెచుకున్నప్పటికీ కలెక్షన్స్ అంతగా రాబట్టుకోలేకపోయింది. గాలి సంపత్ ప్లాప్ గా నిలిచి తర్వాతి వారంలోనే ఓటీటీ లో విడుదలైంది. ఈ మధ్యలో మోసగాళ్లు, అరణ్య , శశి లాంటి సినిమాలు విడుదలయి ప్లాప్ టాక్ ని మూటగట్టుకున్నాయి. మర్చి చివర్లో విడుదలైన నితిన్ ‘రంగ్ దే’ సినిమా మంచి టాక్ తో పరవాలేదనిపించింది.
ఇలా మూడు నెలల్లో నెలకి ఒక బ్లాక్ బస్టర్, ఒక హిట్ అన్నట్టు టాలీవుడ్ దూసుకుపోతుంది. ఇప్పటివరకు టాలీవుడ్ రిపోర్ట్ బాగానే ఉంది. ఇక మున్ముందు పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి పెద్ద హీరోల సినిమాలు లైన్ లో ఉన్నాయి. 2020 లో వచ్చిన నష్టాల్ని పూరించి ఈ సంవత్సరం ఇండస్ట్రీ కళకళలాడాలని ఆశిద్దాం.