టాలీవుడ్: ఇదివరకటి రోజుల్లో ఒక డైరెక్టర్ ఒక హీరోకి సినిమా చెప్పి సినిమా ఒప్పుకున్నాక ఆ సినిమా పూర్తి అయ్యే వరకు ఆ సినిమా చేతులు మారేది చాలా తక్కువ. అంతే కాకుండా ఆ సినిమా ప్రకటించి చేతులు మారడం చాలా అరుదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా లేదు. ఒక డైరెక్టర్ ఒక కథ ఒక హీరో దగ్గరికి వెళ్లి ఒప్పుకున్న తర్వాత వేరే హీరోల దగ్గరికి వెళ్లడం, లేదా డైరెక్టర్ తో సినిమా ప్రకటించిన తర్వాత కొన్ని సినిమాలకి అయితే విడుదల తేదీలు కూడా ప్రకటించినా కూడా సినిమాలు ఆగిపోతున్నాయి. అలా అని అందరూ అలాగే ఉన్నారని లేదు. సుజీత్ లాంటి డైరెక్టర్ ప్రభాస్ కోసం మూడు సంవత్సరాలు ఎదురు చూసాడు, ఇపుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ కోసం మరో రెండు సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు.
ఇలాంటి సంఘటనలు చిన్నసినిమాలకి జరిగితే పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు. పెద్ద హీరో డైరెక్టర్ సినిమాలకి ఇలా జరుగుతుండడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. సుకుమార్ , మహేష్ కాంబినేషన్ లో సినిమా రూపొందాల్సి ఉంది. కానీ సడన్ గా అది కాకుండా అల్లు అర్జున్ తో పుష్ప తెరమీదకి వచ్చింది. ఈ సమయంలో అల్లు అర్జున్ , వేణు శ్రీరామ్ దర్శకత్వం లో ‘ఐకాన్’ అనే సినిమా చేయాల్సి ఉంది, కానీ అది పక్కన పెట్టి పుష్ప మొదలు పెట్టారు. అదే అల్లు అర్జున్ పుష్ప తర్వాత కొరటాల శివ తో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమాకి విడుదల తేదీ కూడా ప్రకటించారు. కానీ అనుకోకుండా సడన్ గా కొరటాల శివ – జూనియర్ ఎన్ఠీఆర్ సినిమా ప్రకటించడం జరిగింది. అలాగే ఈ సినిమా విడుదల తేదీ ప్రకారం కొరటాల తదుపరి సినిమా ఇదే అవబోతుంది.
అలాగే జూనియర్ ఎన్ఠీఆర్ RRR సినిమా తర్వాత హారిక హాసిని బ్యానర్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ప్రకటించారు కానీ కొరటాల తో సినిమా ప్రకటించడం తో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కొన్ని కారణాల వలన తారక్ త్రివిక్రమ్ సినిమా వాయిదా వేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు నిర్మాతలు. ఇలా ఒకటి రెండు కాకుండా ఈ మధ్య ఇలా చాలా సినిమాలు చేతులు మారడం ఇండస్ట్రీ కి మంచిది కాదేమో అనిపిస్తుంది. ఇది ఒక హీరో కి డైరెక్టర్ కి మధ్య రిలేషన్ మాత్రమే కాదు ఇండస్ట్రీ మనుగడకి కూడా కొంచెం విఘాతం కల్పించినట్టు అవుతుంది. మున్ముందు రోజుల్లో పెద్ద హీరోలు, డైరెక్టర్లు సినిమా ప్రకటించే ముందే అన్నీ చూసుకుని ప్రకటిస్తే బాగుంటుందేమో.