న్యూఢిల్లీ: దేశంలో కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయినా బాలీవుడ్, క్రికెట్ స్టార్స్‌కు ప్రచారకర్తలుగా డిమాండ్ ఏ మాత్రం చెక్కుచెదరలేదు. పైగా వీరి మార్కెట్ ఇంకా విస్తరిస్తూనే ఉంది. అందులో నటుడు ఆయుష్మాన్ ఖురానా (36) 19 బ్రాండ్లకు ప్రచారకర్తగా (బ్రాండ్ అంబాసిడర్) వ్యవహరిస్తున్నారు. కరోనా మహమ్మారి, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు, బాలీవుడ్ డ్రగ్స్ కేసు, ఇవేవీ ఖురానా మార్కెట్‌ను అడ్డుకోలేకపోయాయి.
ఇటీవల కోల్గేట్ పామోలివ్ తాజాగా ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడమే ఇందుకు నిదర్శనం. ఇక అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ సైతం కరోనా కల్లోలంలో గట్టిగా నిలబడిన స్టార్సే కావడం గమనార్హం. ఇతర స్టార్స్ మార్కెట్ బోసిపోయినా కానీ, అమితాబ్, ఖురానా, అక్షయ్, ధోనీ, కోహ్లీలను తమ ప్రచారకర్తలుగా నియమించుకునేందుకు కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి.
ఇక బాలీవుడ్‌లో వరుస హిట్‌లతో అదరగొడుతున్న అక్షయ్ ప్రచార కార్యక్రమాల్లోనూ దూసుకెల్తున్నారు. గత నెల రోజుల్లోనే అక్షయ్ ఏకంగా నాలుగు నూతన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారత క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ‘వైజ్’ అనే హెల్త్‌కేర్, శానిటైజర్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా ఇటీవలే సంతకం చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు తెలిపినప్పటికీ మహేంద్రసింగ్ ధోనీ పై కంపెనీలు ఆయన రూపాన్ని తమ ఉత్పత్తుల విక్రయాలకు అపురూపంగానే భావిస్తున్నాయి.
ఇంక దేశంలోనే అత్యంత విశ్వసనీయ సెలబ్రిటీ బ్రాండ్ అమితాబ్ బచ్చన్ అని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ ఇటీవలే నిర్వహించిన ఒక సర్వేలో ప్రజలు తేల్చారు. టీఐఏఆర్‌ఏ రేటింగ్స్ ప్రకారం బచ్చన్ స్కోరు 90 పాయింట్లు. అత్యధికంగా 93.5 పాయింట్లతో అక్షయ్‌కుమార్ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానం బచ్చన్‌దే. ఆయుష్మాన్ ఖురానా స్కోరు 88.5 పాయింట్లు.
క్రీడాకారుల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తి మహేంద్ర సింగ్ ధోనీ. ధోనీ స్కోరు 87 పాయింట్లు. 63.9 పాయింట్లతో కోహ్లీ టాప్ 5లో ఆఖరున ఉన్నారు. కాకపోతే కోహ్లీ (మోస్ట్ హ్యాండ్సమ్) అందగాడుగా సర్వేలో నిలిచారు. ఈ ఐదుగురు స్టార్స్ 2021లోనూ తమ హవా కొనసాగిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.