న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ సెప్టెంబర్ 27వ తెదీ నుండి భారత విపణిలో తమ సెడాన్ కారు అయిన యారిస్ తయారీ మరియు అమ్మకాలను ఆపివేస్తున్నట్లు టయోటా కిర్లోస్కర్ సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. కాగా 2022లో మరిన్ని కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కూడా తెలిపింది.
అయితే యారిస్ కారును ఇప్పటికే కొనుగోలు చేసిన వినియోగదారులకు సేవలు మరియు విడిభాగాలు తపకుండా అందిస్తామని హామీ ఇచ్చింది. కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ సర్వీస్ అవుట్ లెట్ ద్వారా యారిస్ కస్టమర్లకు అందించే సేవలలో ఎటువంటి అంతరాయం కలగదు, దానితో పాటు యారిస్ మోడల్ కారుకు కావాల్సిన ఒరిజినల్ విడిభాగాలను కనీసం 10 సంవత్సరాల పాటు అందుబాటులో ఉండే విధంగా చూస్తామని టయోటా వాగ్దానం చేసింది.
యారిస్ మొదటి కారును టొయోటా 2018 సంవత్సరం ఏప్రిల్‌లో రూ 9 లక్షల నుంచి రూ .14 లక్షల ధరల మధ్య లాంచ్ చేసింది. టయోటా యారిస్ కారును తమ ప్రత్యర్థి అయిన హోండా సిటీకి పోటీగా తీసుకొని వచ్చారు. అయితే ఈ విభాగంలో యారిస్ తన మార్క్ నెలకొల్పడంలో విఫలమవడంతో లాంచ్ చేసిన మూడు సంవత్సరాలకే దీన్ని నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది.