హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్షాలు, వరదల కారణంగా తక్షణ సహాయంతో పాటు శాశ్వత పునరుద్ధరణ చర్యలకు తగిన నిధులు అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు.
ఆయన ఏపీకి ఎలాంటి సాయం చేస్తారో, తెలంగాణకూ అలా చేయాలని, రెండు తెలుగు రాష్ట్రాలను సమానంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్బంగా, కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి మరియు అధికారులు వరదల వల్ల కలిగిన నష్టం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో వరద నష్టం చాలా తీవ్రమైందని చెప్పారు. ప్రాథమిక అంచనా ప్రకారం, రాష్ట్రంలో వరదల వల్ల సుమారు రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించారు.
కేంద్రం నుండి ఎన్డీఆర్ఎఫ్ నిధుల విడుదలకు సంబంధించి మార్గదర్శకాలు సడలించాలని, ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరారు.
వర్షాలు కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఒక్కరోజులోనే 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉందని వివరించారు.
రోడ్లు, ఇళ్లు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు.
బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు అందిస్తోందని కూడా వివరించారు.