ముంబై: అరేబియా సముద్రంలో మాంద్యంగా మారిన నిసర్గ తుఫాను జూన్ 3న మహారాష్ట్ర, గుజరాత్‌లను తాకుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) హెచ్చరించింది. ఈ తుఫాను 129 సంవత్సరాలలో మహారాష్ట్రను తాకనున్నమొదటి ఉష్ణమండల తుఫాను. ప్రస్తుతానికి, లక్షద్వీప్ సమీపంలోని అరేబియా సముద్రంలో తుఫాను కేంద్రియకృతమైఉంది. ముంబై, థానేలకు ఐఎమ్‌డి ఇంతకుముందు ఆరెంజ్ అలర్ట్, పాల్గర్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మహారాష్ట్ర లో ఇప్పటికే కరోనా వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగి 70,000 మార్కును దాటిన తరుణంలో ఈ ముప్పు సవాలే అని చెప్పవచ్చు.
నిసర్గ తుఫాను ముంబైకి దక్షిణాన తీరాన్ని తాకుతుందని భావిస్తున్నందున, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) యొక్క అనేక బృందాలు రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో మోహరించారు. ముంబైలోని పల్ఘర్‌లో మూడు ఎన్‌డిఆర్‌ఎఫ్ జట్లను, థానేలో ఒకటి, రాయ్‌గడ్‌లో 2 జట్లు, రత్నగిరిలో ఒక జట్టు మోహరించారు.ఈ జిల్లాల తీరప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ సహాయ కేంద్రాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని భావిస్తున్న భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) హెచ్చరికను అనుసరించి, రాష్ట్ర ప్రభుత్వం 6 జిల్లాలను హై అలెర్ట్ గా పరిగణించింది. తీరప్రాంతాల్లోని 159 గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు మార్చాలని ప్రభుత్వం ఆదేశించింది.
ప్రస్తుతం పంజిమ్ (గోవా) కు 280 కిలోమీటర్లు పశ్చిమ-నైరుతి దిశలో, ముంబైకి (మహారాష్ట్ర) 490 కిలోమీటర్ల నైరుతి దిశలో మరియు సూరత్ (గుజరాత్) కు 710 కిలోమీటర్ల నైరుతి దిశలో తుఫాను కేంద్రీకృతమైయంది. ఈ తుఫాను జూన్ 3 మధ్యాహ్నం సమయంలో హరిహరేశ్వర్ (మహారాష్ట్ర) మరియు డామన్ మధ్య ఉత్తర మహారాష్ట్ర మరియు దక్షిణ గుజరాత్ తీరాన్ని దాటే అవకాశం ఉంది.