హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్, మరియు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ మధ్య పోటీ చాలా హోరాహోరీగా జరిగింది. టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలు గెలిచినప్పటికీ, క్రితంతో పోలిస్తే మాత్రం ఓటింగ్ శాతం భారీగా తగ్గింది.
మరోపక్క బీజేపీ ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరిగింది. ఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 0.28 శాతమే కావడం, టీఆర్‌ఎస్ కంటే బీజేపీకి 9,744 ఓట్లు మాత్రమే తక్కువ రావడం గమనార్హం. ఈ ఓట్ల శాతం తేడాతో 55 డివిజన్లను టీఆర్‌ఎస్ గెలుచు కోగా, 48 డివిజన్లలో బీజేపీ గెలిచింది.
ఇక ఎప్పట్లాగానే పాత బస్తీలో ఎంఐఎం తన ఓటు బ్యాంకును పదిల పరుచుకుని 18.76% ఓట్లు సాధించింది. కాంగ్రెస్ మాత్రం గతం కంటే తక్కువగా 6.67% ఓట్లకే పరిమితమైందని బ్యాలెట్ లెక్కలు చెబుతున్నాయి. 2016లో టీఆర్‌ఎస్.. 42% ఓట్లతో 99 స్థానాల్లో గెలుపొందగా, ప్రస్తుతం 34.62% ఓట్లకే పరిమితమైంది. ఇక బీజేపీ 2016లో 10% ఓట్లకు పరిమితం కాగా, ఈ సారి ఏకంగా 34.34 శాతానికి ఎగబాకింది.
గ్రేటర్ పరిధిలో 24 నియోజకవర్గాలు ఉండగా, వీటిలో సికింద్రాబాద్, పటాన్‌చెరు, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహుదుర్‌పురా నియోజకవర్గాల్లో ఒక్క డివిజన్‌ను కూడా బీజేపీ రాబట్టుకోలేకపోయింది. ఎంఐఎం బలంగా ఉన్న చార్మినార్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో అధికార టీఆర్‌ఎస్ కంటే ఎక్కువ ఓట్లు సాధించింది.
బీజేపీ ఈ సారి 150 డివిజన్లకు గాను 149 స్థానాల్లో పోటీ చేసి, 48 స్థానాల్లో విజయం సాధించింది. మరో 79 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఎంఐఎం, టీఆర్‌ఎస్ గెలిచిన స్థానాల్లోనూ సరాసరిగా బీజేపీకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. వందకంటే తక్కువ ఓట్లతో రెండు సీట్లు, 500 కన్నా తక్కువ ఓట్లతో 5 సీట్లు, వెయ్యి కన్నా తక్కువ సీట్లతో మరో 5 సీట్లను బీజేపీ కోల్పోయింది.