హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో ఎట్టకేలకు ఉత్కంఠకు తెర పడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ కేవలం 56 డివిజన్లలో మాత్రమే గెలుపొందింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీలు బల్దియా ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయ ఢంకా మోగించి వరుస ప్రభంజనాలు సృష్టించిన పార్టీ, కానీ ఇటీవల కాలంలో కేంద్రంలోని బీజేపీ నుంచి కాస్త గట్టి పోటీనే ఎదుర్కొంటోంది. క్రితం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 99 డివిజన్లను దక్కించుకున్న టీఆర్‌ఎస్, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పట్టును నిలుపుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా 56 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
పాతబస్తీలో తిరుగులేని ఎంఐఎం. గత ఎన్నికల్లో గెలిచిన 44 స్థానాలను నిలుపుకునే దానిపై ధీమాతో ఉంది. ఇప్పటివరకూ 42 స్థానాలు గెలుచుకోగా, ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇటు గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 68 డివిజన్లకు గాను కేవలం 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈసారి అనూహ్యంగా రెండో స్థానం దక్కించుకుంది. 45 డివిజన్లలో విజయం సాధించి 4 స్థానాల్లో ముందంజలో ఉంది.