హైదరాబాద్ : వివాదాస్పదమైన వ్యవసాయ సంస్కరణ బిల్లులు ఎన్నో విమర్శలు, వివాదాల నడుమ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదం లభించేలా చేసింది. స్పష్టమైన మెజార్టీ ఉన్నందున లోక్‌సభలో సునాయాసంగా నెగ్గిన బిల్లులు, రాజ్యసభలో మాత్రం పెను దుమారాన్నే సృష్టించాయి. బీజేపీ చిరకాల మిత్రపక్షం శిరోమణీ అకాలీదళ్ వైదొలగడంతో రాజుకున్న రగడ, రాజ్యసభలో బిల్లు ప్రతులను చింపివేసే వరకు వెళ్లింది.
విపక్షాల నిరసనలు, ఆందోళనల నడమనే పెద్దల సభలోనూ బిల్లులు ఆమోదం పొందాయని డిప్యూటీ చైర్మన్ ప్రకటించడంతో అధికార పక్షం హర్షం వ్యక్తం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ఆమోదించుకున్న వివాదాస్పద బిల్లులపై వివాదం ఇప్పడే ముగిసిపోలేదని దీనిపై పెద్ద ఎత్తున పోరును ముందుకు తీసుకుపోతామని కాంగ్రెస్ నేతృత్వంలోనే విపక్ష పార్టీలు ప్రకటించాయి.
బిల్లు ఆమోదం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మలను దగ్ధం చేసిన ఘటనలు ఉత్తర భారతదేశంతో పాటు దక్షినాదినా కనిపించాయి. అయితే ఈ బిల్లుకు టీఆర్‌ఎస్ వ్యతిరేకంగా ఓటు వేయడం చర్చించాల్సిన అంశం. రానున్న రెండు నెలల్లో తెలంగాణలో పలు ఎన్నికలు జరుగనున్నాయి.
దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ఈసీ రంగం సిద్ధం చేసింది. దానితో పాటు నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఓ మండలి స్థానానికి పోలింగ్ జరుగనుంది. ఈ స్థానానికి సీఎం కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలో ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా ఉన్న బీజేపీ నుంచి అసలైన పోటీ వచ్చే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాల అభిప్రాయం.
దీనిలో భాగంగానే బీజేపీ వ్యతిరేకంగా నడుచుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇస్తే రైతు వ్యతిరేక సందేశం వెళ్లే అవకాశం ఉందని కేసీఆర్ ఊహించినట్లు తెలిసింది. మరోవైపు కీలకమైన ఎన్నికల ముందు బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు టీఆర్‌ఎస్ రచించిన వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పార్లమెంట్ బిల్లు ఆమోదం తరువాత రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రకటనలు చూస్తే ఇది నిజమనే భావన కలుగక మానదు.