వాషింగ్టన్: భారత దేశీ టెక్ నిపుణులు మరియు ఐటీ కంపెనీలకు షాక్‌నిస్తూ హెచ్1 బీ వీసాలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరో చేదు నిర్ణయం తీసుకున్నారు. వీటిపై గతేడాది విధించిన నిషేధాన్ని విధించిన ట్రంప్ మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వీసాల జారీకి మార్చి నెలాఖరువరకూ వీలుకాదని సంబంధిత వర్గాలు తెలియజేశాయి.
దాదాపు 8 నెలలుగా హెచ్1 బీ, తదితర వర్క్ వీసాలపై ఆంక్షలను విధించిన డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో మూడు నెలలపాటు ఈ నిషేధాన్ని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు గల కారణాలపై ట్రంప్ యథాప్రకారం పాత పల్లవినే ఎత్తుకున్నారు. కోవిడ్-19 వల్ల ఉపాధి మార్కెట్‌తోపాటు, అమెరికా ప్రజల ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు ట్రంప్ తాజాగా పేర్కొన్నారు. కరోనా వైరస్ అమెరికన్ల జీవితాలకు విఘాతం కలిగిస్తున్నట్లు చెప్పారు.
అమెరికాలో నవంబర్‌లో నిరుద్యోగిత 6.7 శాతంగా నమోదైన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2020 ఏప్రిల్‌లో నమోదైన గరిష్టంతో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ ఇప్పటికీ పలువురు ఉపాధి కోల్పోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఉపాధి మార్కెట్, ప్రజా ఆరోగ్యాల విషయంలో పరిస్థితులు మెరుగుపడలేదని వివరించారు.
హెచ్1 బీ, తదితర వీసాల జారీపై ట్రంప్ 2019 ఏప్రిల్ 22న తొలిసారి నిలుపుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఆపై జూన్ 22న 6 నెలలపాటు నిషేధాన్ని పొడిగించారు. దీంతో డిసెంబర్ 31కల్లా గడువు ముగియనుండటంతో తాజాగా మరో మూడు నెలలు ఆంక్షలను పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో మార్చి 31వరకూ వీటిపై నిషేధం అమలులో ఉంటుంది.