అమెరికా: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడంతో వలసదారుల్లో ఆందోళన మొదలైంది. “అమెరికా ఫస్ట్” నినాదం కింద ట్రంప్ చేపట్టిన చర్యలు, కొత్త విధానాలు భారతీయులతో పాటు పలు దేశాల వలసదారులపై ప్రభావం చూపుతున్నాయి.
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వెంటనే, అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. ప్రత్యేకంగా జన్మత పౌరసత్వ చట్టాన్ని రద్దు చేస్తూ, అమెరికా పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రుల్లో ఒకరు అమెరికన్ పౌరులు కావాలన్న నిబంధనను అమలు చేశారు. ఇది భారతీయ వలసదారుల జీవితాలకు కొత్త సవాళ్లను తెచ్చింది.
అంతేకాకుండా, హెచ్1బి వీసాల విషయంలో సవరణలు జరిగే అవకాశం ఉండటంతో భారతీయ ఐటీ ఉద్యోగులకు ముప్పు తప్పదని భావిస్తున్నారు. వాణిజ్య విధానాలపరంగా కూడా ట్రంప్ నిర్ణయాలు భారతీయ ఉత్పత్తులపై సుంకాలు పెంచే అవకాశాన్ని చూపిస్తున్నాయి. స్టీల్, మెడిసెన్స్ వంటి ఉత్పత్తులపై భారీ ప్రభావం పడవచ్చని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ట్రంప్-మోదీ మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు కొన్ని సమస్యల్ని పరిష్కరించవచ్చని ఆశిస్తున్నారు. భారత్‌లో జరగనున్న క్వాడ్ సదస్సు సందర్భంగా ట్రంప్ భారత్ పర్యటనకు రావొచ్చని సమాచారం. ట్రంప్ విధానాలు, మోదీ ప్రభుత్వ దౌత్య పటిమ భారతీయ వలసదారులపై ప్రభావాన్ని ఏమేరకు తగ్గిస్తాయో చూడాలి.