అమెరికా: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో ముస్లింలకు ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ఈ విందులో, గత ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపిన అమెరికన్ ముస్లింలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.
రంజాన్ యొక్క పవిత్రతను గుర్తుచేస్తూ, శాంతి కోసం తన ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, 2024 ఎన్నికల్లో ముస్లింల మద్దతు తన విజయానికి కీలకమైందన్నారు.
ప్రారంభ దశలో తక్కువ స్థాయిలో మద్దతు ఉన్నప్పటికీ, చివరికి భారీగా ముస్లింల అండ తనకు లభించిందని పేర్కొన్నారు. తాను అధికారంలో ఉన్నంతకాలం ముస్లిం సమాజానికి పూర్తి మద్దతుగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఇఫ్తార్ పండుగ విశేషాలను వివరించిన ట్రంప్, ప్రపంచ ముస్లింలు ఉపవాసం చేసి అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెప్పే ఈ పర్వదినం ఒక అనుభూతి అని అన్నారు. శాంతి, సామరస్యానికి ఇది ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. “ఈ విందు మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా, నచ్చకపోతే ఫిర్యాదు మాత్రం చేయొద్దు,” అని హాస్యంగా వ్యాఖ్యానించారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై మాట్లాడుతూ, అమెరికా ప్రభుత్వం శాంతి స్థాపన కోసం కీలకంగా పని చేస్తోందని తెలిపారు. ముస్లింల భద్రత, భవిష్యత్ సంక్షేమం కోసం తన ప్రభుత్వాన్ని నమ్మొచ్చని స్పష్టం చేశారు.