ట్రంప్ కొత్త చట్టం భారతీయుల అమెరికా కలలను కల్లలు చేయనుందా?
అంతర్జాతీయం: అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులు, ముఖ్యంగా తెలుగువారికి ఇది పెద్ద దెబ్బగా మారబోతోంది. అమెరికా కొత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టబోతున్న కొత్త చట్టం అమల్లోకి వస్తే, ఇకపై అమెరికాలో పుట్టిన ప్రతి పసికందుకు స్వతంత్ర పౌరసత్వం లభించే అవకాశం ఉండదు. ఇప్పటివరకు, అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డకు ఆ దేశ పౌరసత్వం ఆటోమేటిక్‌గా లభించేలా రూల్స్ ఉండేవి. కాన్పు కోసం మాత్రమే వెళ్లినా, పుట్టిన బిడ్డకు US సిటిజన్‌షిప్ వచ్చేది. అయితే ఈ కొత్త చట్టం అమలులోకి వస్తే, తల్లిదండ్రుల్లో కనీసం ఒకరికి గ్రీన్‌కార్డు లేదా అమెరికా పౌరసత్వం ఉంటేనే పిల్లలకు పౌరసత్వం లభిస్తుంది.
ఈ చట్టాన్ని అక్రమ వలసలను తగ్గించడంలో భాగంగా రూపొందించనున్నారు. ప్రత్యేకించి, H1B మరియు F1 వీసాలపై వెళ్లి అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి ఇది కొత్త సమస్యలను తెచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 12 లక్షల మందికి పైగా గ్రీన్‌కార్డు కోసం వేచి ఉండగా, ఈ కొత్త రూల్ వల్ల వీరి ఆశలు మరింత ప్రతిష్టంభనకు గురవ్వవచ్చు. ఈ క్యూలో EB1, EB2, EB3 కేటగిరీల్లో లక్షలాది మంది వలసదారులు ఉన్నారు.
గ్రీన్‌కార్డు కోసం ఇప్పటికే ఉన్న అప్లికేషన్ ప్రాసెస్ నత్తనడకన సాగుతుండగా, తాజా నిబంధనలు భారతీయులకు మరింత కఠినతరంగా మారనున్నాయి. H1B వీసాలపై ఇప్పటికే నిబంధనలు కఠినమైన సమయంలో, ట్రంప్ తాజా నిర్ణయం అమెరికాలో స్థిరపడాలనుకునే ఎన్నారైలకు ఆశనిపాతంగా మారనుంది.