వాషింగ్టన్: తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమిపాలయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇప్పటికీ అపజయాన్ని అంగీకరించలేదు. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్, మోసం జరిగిందని ఆరోపిస్తూ కోర్టుకు కూడా ఎక్కారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు సంబంధించి ఓ చర్చ కూడా జరగుతుంది.
ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు, మరి రాజకీయాల్లో కొనసాగుతారా లేక తిరిగి తన పాత వ్యాపార జీవితంలోకి ప్రవేశిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోనే కొనసాగనున్నట్లు ప్రకటించారు. మరో ముఖ్య విషయం ఏంటంటే 2024 అధ్యక్ష ఎన్నికల్లో మరో మారు పోటీ చేస్తానని ట్రంప్ స్వయంగా వెల్లడించారు.
వైట్‌హౌస్‌లో నిర్వహించిన క్రిస్టమస్ పార్టీలో ట్రంప్ తన రాజకీయ జీవితం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ నాలుగేళ్లు చాలా అద్భుతంగా గడిచాయి. మరో నాలుగేళ్లు ప్రజలకు సేవ చేయాలని భావించాం. అందుకోసం ఎంతో శ్రమించాం. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయాం. మరో నాలుగేళ్ల తర్వాత మిమ్మల్ని కలుసుకుంటాను’ అంటూ పరోక్షంగా 2024 ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని వెల్లడించారు ట్రంప్.
అలానే ట్విట్టర్ వేదికగా ట్రంప్ ‘మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో’ అంటూ షేర్ చేసిన వీడియోలో ఆయన దేశ ఎన్నికల వ్యవస్థ పూర్తిగా దాడికి గురయ్యిందని, ఎన్నో అవకతవకలు జరగుతున్నాయని తెలిపారు. అందువల్లే తాను ఓడిపోయానని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఎన్నో అవకతవకలు జరిగాయాని, వాటన్నింటికి సంబంధించి తన దగ్గర ఆధారాలున్నాయని తెలిపారు.
దేశానికి అధ్యక్షుడిగా చేసిన తాను ఓడిపోవడం గణాంకపరంగా అసాధ్యం అని ట్రంప్ వీడియోలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆయన పోటీ చేసిన ఆరు రాష్ట్రాలు కూడా తమ ఫలితాలను ధ్రువీకరించాయి. బైడెన్, ట్రంప్ కన్నా ఏడు మిలియన్ల ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించినట్లుగా నేషనల్ కౌంట్ ప్రకటించింది.