వాషింగ్టన్ : అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగిసి కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయినా కూడా ఆ విషయాన్ని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ససేమీరా ఒప్పుకోవడం లేదు. కొత్తగా పగ్గాలు చేపట్టాల్సిన డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌ను అన్ని రకాలా అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో మోసాలు జరిగాయని ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు.
అటార్నీ జనరల్ విలియం బార్ ఓటింగ్ అక్రమాలపై విచారణకు న్యాయశాఖకు అనుమతి ఇవ్వడం, అధికార మార్పిడికి సంబంధించి బైడెన్ బృందానికి సహకరించకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకోవడం తాజా పరిస్థితులు. ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్ ఒకవైపు పెంటగన్ అధ్యక్షుడిని తప్పించారు.
కరోనా కట్టడి కోసం బైడెన్ ఏర్పాటు చేయదలచుకున్న నిపుణుల బృందానికి ప్రభుత్వ విభాగాల ద్వారా ట్రంప్ నో చెప్పించారు. ఎన్నికల్లో ఓటమిని హుందాగా అంగీకరించాలని పలువురు రిపబ్లికన్ సెనేటర్లు, మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ తదితరులు ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చినా ఫలితం లేదు. రిపబ్లికన్ పార్టీలోని కొందరు ముఖ్యులు ట్రంప్‌వైపే నిలబడ్డారు. పార్టీలో తనకు మద్దతు ఇవ్వని వారిని పదవుల నుంచి తప్పించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
తన మద్దతుదారులను సంఘటితంగా ఉంచేందుకు ట్రంప్ ఎన్నికల తరహా ర్యాలీలు నిర్వహించే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులను ముందుంచి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ప్రచారం చేయాలన్నది ట్రంప్ ఆలోచన అని, తాను అజ్ఞాతంలో ఉండే అవకాశముందని సమాచారం.