వాషింగ్టన్: ఇక ముందు విదేశాల్లో ఏవైనా యుద్ధాలకు జరిగితే తమ దేశ బలగాలను పంపబోమని, అవన్నీ అంతులేని నిరర్థక యుద్ధాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న తమ సైనికులను వెనక్కు రప్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
కేవలం తమ దేశానికి ప్రమాదం తలపెట్టె టెర్రరిస్టులను మట్టుపెట్టేందుకు మాత్రమే ఈ సైన్యాన్ని ఉపయోగించుకుంటమని ఆయన అన్నారు. ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ దశాబ్దాలుగా అమెరికా రాజకీయవేత్తలు విదేశాల పునర్‌నిర్మాణం, విదేశీయుద్ధాల్లో పోరాడటం, విదేశీ సరిహద్దులను కాపాడడం వంటి పనులపై లక్షల కోట్ల డాలర్లు వెచ్చించారన్నారు.
కానీ ప్రస్తుతం అమెరికా సేనలు అమెరికాను, అమెరికా నగరాలను రక్షించేందుకు మాత్రమే పరిమితమవుతున్నాయని, అమెరికా బలగాలు స్వదేశాలకు వస్తున్నాయని చెప్పారు. విదేశాల్లో జరిగే అనవసర యుద్ధాలకు మన సైన్యం వెళ్లదని, కానీ దేశానికి ముప్పుగా భావించే ఉగ్రవాదులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదని చెప్పారు.
ప్రపంచంలో తమకున్నంత సైనిక సంపత్తి మరి ఏ దేశానికి లేదని, ఆ బలం చూపించే శాంతిని పరిరక్షిస్తామని వివరించారు. ఈ ర్యాలీకి జనం భారీగా హాజరయ్యారు. కరోనా నిబంధనలను పక్కనబెట్టిమరీ జనం హాజరుకావడం ట్రంప్‌నకు మంచి ఉత్సాహాన్నిచ్చింది. డెమొక్రాట్లు అధికారంలోకి వస్తే పన్నులు పెంచుతారని, ఆయుధాల హక్కును రద్దు చేస్తారని, ఆ పార్టీ నిండా వామపక్షవాదులున్నారని దుయ్యబట్టారు.
క్యూబా, వెనుజులా విధానాలను డెమొక్రాట్లు అమలు చేస్తారని విమర్శించారు. డెమొక్రాట్ నాయకురాలు కమలా హారిస్‌పై నేరుగా విమర్శలు చేశారు. కరోనా సంక్షోభం నుంచి అమెరికా ఎకానమీని తొందరగా బయటకు రప్పించామని చెప్పుకొచ్చారు.