వాషింగ్టన్ : చైనా దేశంపై, అక్కడి వ్యాపారలపై ఇప్పటికే చాలా ఆగ్రహంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా కంపెనీలకు వరుస షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టిక్‌టాక్ నిషేధానికి రంగం సిద్ధం చేసుకున్న ట్రంప్, తాజాగా టెక్నాలజీ దిగ్గజం అలీబాబాను కూడా టార్గెట్ చేశారు. అలీబాబా వంటి చైనా కంపెనీలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ప్రపంచాన్ని భయాందళనలకు గురి చేస్తున్న కరోనా గురించి ముందుగా సరైన సమాచారాన్ని అందించకుండా దాచిపెట్టిందన్న ఆగ్రహం ఒకవైపు, మరోవైపు రానున్న ఎన్నికల్లో నేపథ్యంలో చైనా కంపెనీలపై ఉక్కుపాదం మోపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అలీబాబాపై నిషేధాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం దృష్టిలో చైనా యాజమాన్యంలోని ఇతర ప్రత్యేక సంస్థలు ఉన్నాయా అని ప్రశ్నించినపుడు ట్రంప్ ఈ సంకేతాలు ఇచ్చారు. అమెరికాలో ఇతర కంపెనీల నిషేధం విషయాన్నికూడా పరిశీలిస్తున్నామన్నారు.
కాగా టిక్‌టాక్ నిషేధం అంశంపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన ట్రంప్, అమెరికాలో టిక్‌టాక్ వ్యాపారాన్ని ఏదేని అమెరికా కంపెనీకి విక్రయించాలని, లేదంటే నిషేధం తప్పదని బైట్‌డాన్స్‌కు తేల్చి చెప్పారు. ఈ మేరకు విధించిన 45 రోజుల గడువును 90 రోజులకు పెంచుతూ ఇటీవల ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.