అమెరికా: యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ దేశాలకు ఘాటు హెచ్చరిక జారీ చేశారు. వెనెజులా నుంచి చమురు లేదా గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 25 శాతం టారిఫ్ పన్ను విధిస్తామని ఆయన ప్రకటించారు. తాజా నిర్ణయం వెనెజులా నుంచి చివరిసారిగా కొనుగోలు చేసిన తేదీ నుంచి ఏడాది పాటు అమల్లో ఉంటుంది.
ఈ పరిణామంతో చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్, చైనా లాంటి దేశాలపై ప్రభావం చూపనుంది. ప్రస్తుతం భారత్ రోజుకు 2.5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును వెనెజులా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇది భారత చమురు దిగుమతుల్లో 1.5 శాతం వాటా. అలాగే చైనా 5 లక్షల బ్యారెళ్ల మేరకు కొనుగోలు చేస్తోంది.
ఇటీవల వెనెజులా నుంచి అక్రమ వలసదారులను అమెరికా యుద్ధ విమానాల్లో తరలించి పంపిన నేపథ్యంలో ఈ వివాదం తలెత్తింది. దీనిపై మండిపడిన వెనెజులా.. ఇకపై అమెరికా విమానాలకు తమ దేశంలో ప్రవేశం లేదని ప్రకటించింది. అంతేకాదు, అమెరికాకు చమురు ఎగుమతులపైనా నిషేధం విధించింది.
దీనిపై స్పందించిన ట్రంప్, చమురు కొనుగోలుతో వెనెజులాను ఆదుకునే దేశాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయం ప్రపంచ చమురు మార్కెట్‌ను తలకిందులు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.