అంతర్జాతీయం: విదేశీ విద్యార్థుల నెత్తిన ట్రంప్ మరో పిడుగు – లక్షల మంది భారతీయుల భవిష్యత్తు అనిశ్చితిలో..
ఓపీటీ రద్దు ప్రతిపాదనతో కలకలం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకువస్తున్న తాజా ప్రతిపాదన విదేశీ విద్యార్థులపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. అమెరికా యూనివర్సిటీల్లో చదువుతున్న విదేశీ విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అనుభవం పొందే అవకాశం కలిగించే ఓపీటీ (Optional Practical Training – OPT) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని ట్రంప్ భావిస్తున్నట్టు వెల్లడైంది.
ఈ ప్రతిపాదనకు అనుగుణంగా అమెరికన్ కాంగ్రెస్‌కు బిల్లు సమర్పణకు సన్నాహాలు జరుగుతున్నాయి. బిల్లు ఆమోదమైతే 3 లక్షల మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది.
ఓపీటీ అంటే ఏమిటి?
ఓపీటీ ప్రోగ్రామ్ ద్వారా విదేశీ విద్యార్థులు అమెరికాలో తమ కోర్సు పూర్తయ్యాక ఒక నుంచి మూడేళ్ల పాటు నైపుణ్యాధారిత ఉద్యోగాల్లో పని చేసే అవకాశం పొందుతారు. ఈ అనుభవంతో హెచ్1బీ (H-1B) వీసా కోసం అర్హత సాధించి అక్కడే ఉద్యోగాన్ని కొనసాగించడంలో ఎంతో సులువుగా మారుతుంది.
ఇది భారతీయ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారడంతో, అమెరికాలో ఉన్నత విద్య కోసం భారత్ నుంచి వేలాదిమంది విద్యార్థులు వెళ్లే పరిస్థితి నెలకొంది.
ప్రభావితమయ్యే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంది?
ఓపీటీ రద్దయితే, విదేశీ విద్యార్థులు కోర్సు పూర్తైన వెంటనే తమ స్వదేశాలకు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కెరీర్ అభివృద్ధిలో విఘాతం, ఆర్థికంగా నష్టాలు, హెచ్1బీ వీసా కోసం తీవ్ర పోటీ – ఇవన్నీ విద్యార్థులకు ఎదురయ్యే ప్రధాన సమస్యలు.
తక్కువ సంఖ్యలో మాత్రమే హెచ్1బీ వీసాలు జారీ చేయబడుతున్న నేపథ్యంలో ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడనుంది.
అమెరికా ప్రయోజనాలపై కూడా దెబ్బే
ఓపీటీ రద్దుతో అమెరికాకు కూడా నష్టం తప్పదని నిపుణులు చెబుతున్నారు. అత్యధిక శాతం విద్యార్థులు కేవలం ఓపీటీ విధానం వల్లే అమెరికా వెళ్తున్నారు. విదేశీ విద్యార్థులు చేరికలు తగ్గడం వల్ల యూనివర్సిటీల ఆదాయంలో భారీ లోటు ఏర్పడుతుంది. ఇదే సమయంలో నైపుణ్యాలు కలిగిన వర్క్‌ఫోర్స్ లభ్యత లోపించడం వల్ల అమెరికన్ కంపెనీలు సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ రంగాల్లో మానవ వనరుల కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది.
విదేశీ విద్యార్థుల వల్ల అమెరికా విద్యా, ఉద్యోగ రంగాల్లో ఏర్పడే లాభాలను దృష్టిలో ఉంచుకుని ఓపీటీ వంటి కార్యక్రమాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.