హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో దసరా పండుగ తరువాతి రోజును సెలవుగా ప్రకటించాలని అధికారులను ఆదేశించారు. ఇక నుంచి ప్రతి ఏడాది దసరా మరుసటి రోజు సెలవుగా షెడ్యూల్ రూపొందించాలి తెలిపారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ పలు కీలక అంశాలపై చర్చించారు.
డీఏ ఎంత అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని, రాష్ట్రాలు కేంద్ర నిర్ణయాన్ని అనుసరిస్తున్నాయి అని స్పష్టం చేశారు. కేంద్రం జాప్యం వల్ల డీఏ బకాయిలు పేరుకుపోతున్నాయని విమర్శించారు. ప్రతి 6 నెలలకు రాష్ట్రంలో చెల్లించాల్సిన డీఏ నిర్ణయించాలని, కేంద్రం అంచనాలు అందిన తర్వాత అవసరమైతే సవరించాలని అధికారులకు సూచించారు.
కేబినెట్‌లో చర్చించి డీఏపై విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. 2019 జులై 1 నుంచి రావాల్సిన ఒక డీఏను వెంటనే ఉద్యోగులకు చెల్లించాలి, డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.
2020-21 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం భారీగా తగ్గిందని, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కోత పడిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 29న ధరణి పోర్టల్ సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్నారు.
తెలంగాణలో వరద సాయం చేసేందుకు ఉద్యోగులు ముందుకొచ్చారు. ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రకటించారు. వారి నిర్ణయంతో దాదాపు రూ.33కోట్ల విరాళం ప్రభుత్వానికి అందనుంది.