హైదరాబాద్ : తెలంగాణ లో కొత్త సచివాలయ భవనాన్ని ఒక సంవత్సర కాలంలోనే సిద్ధం చేయాలన్న లక్ష్యంతో త్వరితగతిన పనులు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. రానున్న దసరా రోజున పనులు ప్రారంభించి తదుపరి దసరా వరకు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తోంది.
దాదాపు 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడంతస్తుల భారీ భవనం, చుట్టూ పచ్చికబయళ్లు, విశలమైన రోడ్లు, ఉండనున్న ఇంత పెద్ద ప్రాజెక్టు 12 నెలల్లో పూర్తి చేయటం అంత సులభం కానప్పటికీ, వీలైనంత తొందరలో ప్రధాన భవనాన్ని సిద్ధం చేయాలని ఆదేశించింది. భవన నిర్మాణానికి వీలుగా 4 రకాల విభాగాల నుంచి అనుమతులు పొందాల్సి ఉండటంతో అధికారులు ఆ కసరత్తు ప్రారంభించారు. అనుమతులు వచ్చేలోపు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఇంత ముందు ఉన్న సచివాలయ భవనానికి మూడు వైపుల మాత్రమే రోడ్డు ఉండేది. ఐతే నూతన సచివాలయ భవనానికి మాత్రం వెనక వైపు కూడా రోడ్డు నిర్మించనున్నారు. దీంతో భవనం నాలుగువైపులా రోడ్డు ఉండబోతోంది. మింట్ భవనానికి మరియు సచివాలయం మధ్య నుంచి ఇప్పుడు కొత్తగా రోడ్డును నిర్మించనున్నారు.
గతంలో జీ బ్లాక్ ఉన్న ప్రాంతానికి కాస్త అటుఇటుగా ప్రధాన భవనం నిర్మితం కానుంది. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ బ్లాక్ కొత్త సచివాలయ ప్రహరీ ఆవలివైపు చేరనుండటం విశేషం. ఇప్పుడున్న సచివాలయ ప్రవేశద్వారం ఇక కనుమరుగు కానుంది. హుస్సేన్‌సాగర్ వైపు ఉన్న పాత ప్రవేశద్వారం మాత్రమే కనిపిస్తుంది.