హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కి చేజారిన 324 ఎలక్ట్రిక్ బస్సులను పొందేందుకు తిరిగి ప్రయత్నాలు ప్రారంభించింది. ‘ఫాస్టర్ అడాప్సన్ అండ్ మాన్యుఫాక్చర్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్)’పథకం రెండో విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది రాష్ట్రానికి 324 బ్యాటరీ బస్సులను మంజూరు చేసింది.
అయితే ఆ సమయంలో ఆర్టీసీలో ఉధృతంగా సమ్మె జరుగుతుండటం, నాన్ ఏసీ బస్సులు తీసుకోవాలని నిర్ణయించుకోవడం, ఓ ఉన్నతాధికారి ఏసీ బస్సులే కావాలంటూ ఒత్తిడి ప్రారంభించటంతో ఆర్టీసీ చివరకు వాటిని వదులుకుంది. అయితే, ఇప్పటికీ ఆ కేటాయింపులు సజీవంగానే ఉన్నాయని తాజాగా ఢిల్లీ నుంచి ఆశావాహ సమాచారం రావటంతో వాటిని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
ఆ ఫేమ్ పథకం మొదటి విడతలో రాష్ట్రానికి 40 ఎయిర్ కండీషండ్ ఎలక్ట్రిక్ బస్సులు రాగా, అవి తెల్ల ఏనుగుల్లా మారిపోయాయి. ప్రస్తుతం విమానాశ్రయం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల మధ్య వీటిని తిప్పుతున్నారు. వీటి నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండటం, పూర్తి లోఫ్లోర్ డిజైన్‌తో ఉండటం వల్ల దూర ప్రాంతాలకు నడపలేకపోవటం, వెరసి ఆర్టీసీకి అవి గుది బండగానే మారాయి.
ఇక ఎలాగూ ఏసీ బస్సులు వద్దనుకున్న నిర్ణయంతో ఉన్న ఆర్టీసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు దీన్ని ఒక వంకగా చూపి ఆ బస్సులకు టెండర్లు పిలవలేదు. గడువులోపు టెండర్లు పిలవనందున ఫేమ్ పథకం కేటాయింపులు కూడా రద్దయ్యాయి. మరోవైపు ఇప్పుడు ఆర్టీసీకి అత్యవసరంగా 1,300కు పైగా బస్సులు కావాల్సి వచ్చింది.
బ్యాటరీ బస్సులు కొన్ని సమకూరితే నిర్వహణ వ్యయం కూడా తగ్గి కలిసి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. పాత మంజూరీని కేంద్రం పునరుద్ధరిస్తే నాన్ ఏసీ బస్సులే తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు.