తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి భక్తులు విరాళాల రూపంలో అపూర్వంగా ఆదరణ తెలుపుతున్నారు. తాజాగా ఒక్కరోజులోనే రూ.2.45 కోట్ల విరాళాలు టీటీడీకి అందాయి.
దీనిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ, భక్తుల ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ నడుపుతున్న పలు ట్రస్టులకు ఇస్తున్న విరాళాలు తిరుమలలో సేవా కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తున్నాయని చెప్పారు.
చెన్నైకి చెందిన జినేశ్వర్ ఇన్‌ఫ్రా వెంచర్స్ సంస్థ ఎస్వీ అన్నదాన ట్రస్టుకు ఏకంగా రూ.1 కోటి విరాళంగా అందించగా, శ్రీలంకకు చెందిన భక్తుడు కూడా అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1 కోటి విరాళం ఇచ్చాడు. విదేశీ భక్తుడి దాతృత్వం టీటీడీ వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది.
అంతేగాక, నోయిడా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పసిఫిక్ బీపీవో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీవెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.45 లక్షల విరాళం అందించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న విరాళాలు తిరుమలలోని సేవా కార్యక్రమాలకు బలాన్నిస్తున్నాయని టీటీడీ అధికారులు వ్యాఖ్యానించారు.
ఇలా తిరుమలకు విరాళాల వర్షం కురుస్తుండటంతో భక్తుల భక్తిశ్రద్ధలకు ప్రతి రూపంగా టీటీడీ అభివృద్ధి వేగంగా సాగుతోంది.