తిరుపతి: సుప్రీం ఆదేశాలపై టీటీడీ మాజీ చైర్మన్లు స్పందన
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి స్వాగతించారు. కోర్టు ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. కేవలం రాజకీయ కుట్రలతో తమపై నిందలు వేయడం అన్యాయమని అన్నారు.
140 కోట్ల హిందూవుల మనోభావాలను మరియు తిరుమల దేవస్థాన ప్రతిష్టకు మచ్చ కలిగించేందుకు లడ్డూ తయారీపై ఆరోపణలు చేశారని, చంద్రబాబు నాయుడు చేసిన “లడ్డూ తయారీలో జంతు కొవ్వు వాడుతున్నార” అనే వ్యాఖ్యలు దురుద్దేశపూరితమని ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ లేదా సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని తొలినుంచి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలు భగవంతుడి వరంగా భావిస్తున్నామని చెప్పారు.
తమ హయాంలో ఏఆర్ కంపెనీకి నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొనే అవకాశం కూడా రాలేదని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నెయ్యి టెండర్లు పిలిచారని, ఆ సమయంలో ఉన్న అధికారులు తీసుకున్న నిర్ణయంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఏఆర్ కంపెనీ నెయ్యి సరఫరాలో కల్తీ జరిగిందా లేదా అనే అంశం విచారణ ద్వారా స్పష్టమవుతుందని, తాము ఎదుర్కొంటున్న ఆరోపణలపై న్యాయం జరుగుతుందని నమ్మకమన్నారు.