తిరుమల: వెంకన్న భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్!
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్య ఆరాధనలకు, అన్న ప్రసాదాల తయారీకి, మరియు లడ్డూ ప్రసాదాల తయారీకి ప్రధానంగా స్వచ్ఛమైన నెయ్యి మాత్రమే వినియోగిస్తారు.
ఈ విషయంలో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అధిక వినియోగం చేసే నెయ్యి పై సర్వత్రా చర్చ సాగుతోంది.
నెయ్యి నాణ్యత విషయంలో టీటీడీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఈవో జె. శ్యామలరావు దీనిపై నిపుణుల కమిటీని నియమించి విధివిధానాలు రూపొందించాలని సూచించారు.
నెయ్యి క్వాలిటీ పెరిగితే లడ్డూ నాణ్యత పెరుగుతుందా అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.
ప్రసాదాల తయారీకి నెయ్యి వినియోగం:
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి నిత్యం పెద్ద పెద్ద కడాయిలలో నెయ్యి సలసల కాగుతూ ఉంటుంది.
ప్రసాదాల తయారీకి అధికంగా నెయ్యి అవసరం ఉన్నందున టీటీడీ ఏటా 5 వేల టన్నుల నెయ్యిని వినియోగిస్తోంది.
మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తుంది. ఆన్లైన్ ప్రొక్యూమెంట్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేస్తుంది.
నెయ్యి నాణ్యత పర్యవేక్షణ:
ఒక కమిటీతో పాటు టీటీడీ బోర్డ్ కమిటీ, పాలకమండలి తీర్మానం అనంతరం నెయ్యిని కొనుగోలు ప్రక్రియ సాగిస్తుంది.
నెయ్యి నాణ్యత విషయంలో రాజీ పడకుండా, అధునాతనమైన లేబరేటరీని కూడా తిరుమలలో ఏర్పాటు చేసింది. ప్రతి 6 నెలలకొకసారి టెండర్లు పిలిచి ఇ-ప్రోక్యూర్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది.
2023 మార్చిలో 20 లక్షల కేజీల నెయ్యి కొనుగోలుకు టెండర్లను పిలిచినప్పుడు 6 మంది ట్రేడర్లు పాల్గొనగా, అందులో ఇద్దరిని ఎంపిక చేశారు.
ఎంపిక చేసిన సంస్థలు:
ఎంపికైన సంస్థల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రీమియర్ కంపెనీ ఎల్-1 స్థానాన్ని దక్కించుకోగా, ఆల్ఫా కంపెనీ ఎల్-2 గా నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందింది.
కేజీ నెయ్యి రూ. 424 లు ప్రకారం టీటీడీకి సప్లై చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. 65 శాతం నెయ్యిని ప్రీమియర్ కంపెనీ నుండి సేకరిస్తారు.
నెయ్యి నాణ్యత నియంత్రణ:
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా టీటీడీ తీసుకున్న చర్యల వలన లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెరిగింది.
తక్కువ నాణ్యత గల నెయ్యిని సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో జె. శ్యామలరావు హెచ్చరించారు.
నాణ్యమైన నెయ్యి కోసం:
ముడిసరుకులు, నెయ్యి ప్రొక్యూర్ మెంట్ సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ కమిటీ వారంలో నివేదిక అందిస్తుందని, క్వాలిటీ నెయ్యి కోసం టెండర్‌లో ఎలాంటి అంశాలు చేర్చాలని దిశ నిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు.
సరఫరాదారులపై చర్యలు:
ప్రస్తుత సప్లయర్స్‌ను పిలిచి క్వాలిటీ నెయ్యి సరఫరా చేయాలని సూచించారు. కొన్నిసంస్థలు హై క్వాలిటీ నెయ్యి పంపిస్తుండగా, మరికొన్ని సంస్థలు నాసిరకం నెయ్యి అందిస్తున్నాయని పేర్కొన్నారు.
ఓ సంస్థ అడల్ట్రేట్ నెయ్యి ఇస్తున్నట్లు, వెటిటబుల్ ఫ్యాట్ కలుపుతున్నట్లు ఎన్ఏబిఎల్ టెస్ట్‌లో తేలిందని తెలిపారు. టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యి నమూనాలను నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్‌కు పంపి, టెండర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టామని, మరో కంపెనీపై చర్యలు తీసుకుంటామని వివరించారు.