తిరుపతి: ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు సంబంధించిన పదవుల భర్తీపై ఇప్పుడు రాజకీయం వేడెక్కుతోంది.
ఇటీవల టీటీడీ పాలకమండలిని సీఎం చంద్రబాబు నాయుడు నియమించిన తరువాత, మిగతా కీలక పదవుల భర్తీపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.
ప్రధానంగా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) చైర్మన్, సీఈవో, సలహాదారు, చీఫ్ అడ్వైజర్ పదవులు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.
ఎస్వీబీసీ చైర్మన్ పదవికి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు మరోసారి ఆసక్తి చూపుతుండగా, మాజీ ఎంపీ మురళీమోహన్, నిర్మాత అశ్వినీదత్ వంటి ప్రముఖులు కూడా తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఇవి మాత్రమే కాకుండా శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ (ఎస్‌వీఈటీఏ) ఛైర్మన్ పదవికి కూడా పోటీ తీవ్రంగా ఉన్నట్లు సమాచారం.
జనసేన నాయకులు, తిరుపతికి చెందిన యువ నాయకులు, టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు ఈ పదవులపై తమ ఆశలు పెట్టుకున్నారు.
తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నామినేటెడ్ పదవిపై నారా లోకేష్‌ను అభ్యర్థించారు.
పదవులపై పోటీ మొదలవడంతో, సినీ రంగం, రాజకీయ రంగం నడుమ హోరాహోరి నెలకొంది.
టీటీడీ వంటి ప్రముఖ సంస్థకు సంబంధించి ఈ పదవుల భర్తీ ఆచి తూచి చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.