తిరుమల: తిరుమలలో ప్రసిద్ధి అయిన లడ్డూ ఇకపై పర్యావరణ అనుకూలమైన సంచులలో అందించనున్నారు. పర్యావరణంలో కలిసి పోవడానికి వందల ఏళ్లు పట్టే ప్లాస్టిక్ కవర్ల స్థానంలో ఇకపై కేవలం కూరగాయల పదార్థ వ్యర్థాలు మరియు తిండి గింజల నుంచి సేకరించిన పిండి పదార్థంతో ఈ ఎకొలాస్టిక్ లతో తయారు కావడంతో టీటీడీ ఇకపై వీటిని వినియోగించడానికి అంగీకరించింది.
ఈ నూతన సంచులను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు చెందిన అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లేబొరేటరీ డైరెక్టర్ రామ్‌మనోహర్‌బాబు తెలిపారు. కాగా ప్రమాదకరమైన వన్ టైం యూజబుల్ ప్లాస్టిక్‌కు మారుగా కేంద్ర ప్రభుత్వ సహకారం, నాగార్జున విశ్వవిద్యాలయం మరియు డీఆర్‌డీవోతో కలసి హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఎకొలాస్టిక్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తుల (ఎకొలాస్టిక్)ను చర్లపల్లి పారిశ్రామికవాడలో కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలసి శుక్రవారం ఆయన విడుదల చేశారు.
ఈ విషయంపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామ్‌మనోహర్ మాట్లాడుతూ రోజువారి జీవితంలో భాగంగా మారిపోయిన ప్లాస్టిక్ భూమి, నేల, నీరు, జలచరాలకు ప్రమాదంగా పరిణమించిందని తెలిపారు. అందువల్ల ప్లాస్టిక్ బదులుగా వాడి పడేసిన కొన్ని నెలలకే సురక్షితం గా, సంపూర్ణంగా నాశనమయ్యే ఎకొలాస్టిక్ వంటి ప్రత్యామ్నాయ ప్లాస్టిక్‌ను వాడటం వల్ల అందరికీ మేలు జరుగుతుందన్నారు.
డీఆర్‌డీవో సైంటిస్ట్ కె. వీరబ్రహ్మం, నాగార్జున వర్సిటీ సంయుక్తంగా చేసిన పరిశోధనల వల్ల ఈ ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ ఆవిష్కరణ జరిగినట్లు తెలిపారు. కాగా వచ్చే ఏడాదిలోగా దేశం మొత్తంగా వాడి పారేసే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్న నిర్ణయం నేపథ్యంలో ఇలాంటి పర్యావరణ హిత ఉత్పత్తుల అవసరం చాలా ఉంది అన్నారు.